Telugu Global
Andhra Pradesh

మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే..

అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారని, మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంతవరకు సబబని జగన్‌ ప్రశ్నించారు.

మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే..
X

ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలులో జరిగిన బహిరంగ సభలో స్పందించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కట్టార‌ని, మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తున్నాడ‌ని ఆయన మండిపడ్డారు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇది మీ జగన్‌ మాట. ఇది వైఎస్సార్‌ బిడ్డ మాట అంటూ సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.

మోడీ సమక్షంలో బాబు ఈ విషయంపై మాట్లాడగలరా?

మైనారిటీలకు రిజర్వేషన్లపై మోడీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలరా? అని జగన్‌ ప్రశ్నించారు. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారని ఆయన చంద్రబాబును నిలదీశారు. `మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పఠాన్, సయ్యద్, మొగల్స్‌ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చినవి ఈ రిజర్వేషన్లు`.. అని వివరించారు.

వారి నోటి వద్ద కూడును లాగేయడం సబబు కాదు..

అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారని, మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంతవరకు సబబని జగన్‌ ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం వాళ్ల జీవితాలతో ఆడుకోవడమని, ఇది దుర్మార్గం కాదా? అని నిలదీశారు. మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్‌ ఇమాందార్‌కు తాము మద్దతుగా నిలబడతామని చెప్పారు. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పునరుద్ఘాటించారు.

నా.. నా.. నా.. అంటూ ఎందుకంటున్నానంటే..

తమ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదని జగన్‌ చెప్పారు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు తన పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం, ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమివ్వడం వంటివి చేశామన్నారు. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నానని తెలిపారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతిసారీ తాను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం అంతగా పెరుగుతుందనే అభిప్రాయంతో అని వివరించారు. తద్వారా వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తాను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

First Published:  9 May 2024 2:44 PM IST
Next Story