Telugu Global
Andhra Pradesh

వైఎస్‌ జగన్ నెక్ట్స్ లెవ‌ల్ లీడ‌ర్‌: ఆయన విజన్‌ ఇదీ..

నవరత్నాల పేరుతో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిశ్చింతగా, కలతలకు దూరమై జీవించడం గమనించవచ్చు.

వైఎస్‌ జగన్ నెక్ట్స్ లెవ‌ల్ లీడ‌ర్‌: ఆయన విజన్‌ ఇదీ..
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాత తరం నేతలకు ఏ మాత్రం అర్థం కారు. ఆయన విజన్‌ కూడా ఒక తరం ముందు ఉందనే విషయాన్ని కూడా గమనించే స్థితిలో పాత తరం నాయకులు లేరు. పాత తరం రాజకీయాలకు కాలం చెల్లిందని గ్రహించిన నాయకుడు కూడా ఆయన. జాగ్రత్తగా గమనిస్తే జగన్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగన్నరేళ్ల కాలంలో రాజకీయాలు చేయకపోవడాన్ని మనం గమనించవచ్చు. ప్రజల సమస్యలను తీర్చడంలోనే ఆయన ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమైంది, ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయ నాయకుల పాత్రను పూర్తిగా తగ్గించారు. ఇది పాత తరం రాజకీయ నాయకులకు రుచించే విషయం కాదు. అంతేకాకుండా కులాలకు, మతాలకు అతీతంగా ఆయన తన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం చూస్తాం.

నవరత్నాల పేరుతో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిశ్చింతగా, కలతలకు దూరమై జీవించడం గమనించవచ్చు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రోగ్రామ్‌ లేకపోవడాన్ని కూడా మనం చూడవచ్చు. జగన్‌ కన్నా ఒక తరం వెనకబడిన నాయకుడు ఆయన. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి చంద్రబాబు సమకాలీకుడు. అందువల్ల చంద్రబాబుకు జగన్‌ విజన్‌ అర్థమయ్యే అవకాశం లేదు. పాత తరానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నాయకులు జగన్‌ను అర్థం చేసుకోవడం లేదు. దానివల్ల వారు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిందేమిటనేది ఎరిగిన నేతగా జగన్‌ అందుకు అనుగుణంగానే పాలన సాగిస్తూ వచ్చారు. పథకాల అమలులో అధికారుల పాత్రను ఆయన పెంచారు. అది పాత తరం రాజకీయ నాయకులకు అర్థమయ్యేది కాదు. గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రైమ్‌ రేటు గణనీయంగా తగ్గింది. దానికి ప్రధాన కారణం నిరుపేదల చేతుల్లో డబ్బులు ఆడడం, మద్యం విరివిగా అందుబాటులో లేకపోవడం మరో కారణం. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవల మధ్య దళారులు లేకుండా, క్యూల్లో నిలుచోవాల్సిన అవసరం లేకుండా అందుతున్నాయి. దీంతో ప్రజలకు మెరుగైన జీవితాలు అనుభవంలోకి వచ్చాయి. రాష్ట్రంలో జగన్‌ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల అది సాధ్యమైంది. ప్రజలకు జరుగుతన్న మేలును చూడకుండా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేస్తూ వచ్చారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ఆ విమర్శలు చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలియంది కాదు.

వైఎస్‌ జగన్‌ అన్ని కులాల సమాన ప్రగతికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అట్టడుగువర్గాలను సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా తనతో పాటు తీసుకుని పోవడానికి ఆయన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే జగన్‌ 56 కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన బుడుబుక్కల వంటి కులాలకు కూడా కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. మైనారిటీల మేలుకు కూడా ఆయన పథకాలను అమలు చేస్తున్నారు. ఇదంతా ఆయన రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు. ఇది జగన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నది కాదు. ఎన్నికలు వచ్చినప్పుడే ఏదో చేస్తున్నట్లు కనిపించడం ఆయన తత్వానికి పడనిది. అన్ని వేళలా ఆయన ప్రజల మేలుకే నిర్ణయాలు చేస్తున్నారు, వాటిని అమలు చేస్తున్నారు.

లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన రాష్ట్రానికి భారీ రాజధాని అవసరం లేదనేది కూడా ఆయన భావన. అమరావతి వంటి నగరాన్ని నిర్మించడం సాధ్యమయ్యేది కాదనే విషయం ఆయన ఎరుకలో ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్ట‌ణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకుంటే రాష్ట్రంపై ఆర్థిక భారం పడదని ఆయన ఆలోచన. పైగా, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కూడా ఇతర ప్రాంతాలకు సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక జాతి పటిష్టతకు అన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల ప్రజలు వివక్షకు, నిర్లక్ష్యానికి గురయ్యామనే భావనకు గురి కాకూడదు. ఈ కారణాల వల్లనే ఆయన మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించారు. పైగా ఆయన ఆలోచన శివరామకృష్థన్‌ కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగానే కాకుండా శ్రీబాగ్‌ ఒడంబడికకు కూడా అనుగుణంగా ఉంది.

పాత రెడ్డి సామాజిక వర్గం అవసరం రాష్ట్రంలో తీరిపోయింది, అందుకే జగన్‌ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారు. జగన్‌ చేపట్టిన కార్యక్రమాల వల్ల రాష్ట్ర రాజకీయాల్లో కులం పాత్ర, ప్రభావం కూడా తగ్గుముఖం పట్టాయి. దీన్ని రాజకీయ నాయకులు గుర్తించే స్థితిలో లేరు. దాన్ని గమనించే తన వెంట వచ్చే తరాన్ని తయారు చేసుకోవడానికి శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్‌ల మార్పిడికి జగన్‌ నడుం బిగిస్తున్నారు. సీనియర్‌ నాయకులను పక్కన పెట్టి వారి సంతతికి లేదా వారసులకు టికెట్లు ఇవ్వడంలోని ఆంతర్యం కూడా అదే. తన తరం నాయకుల వల్ల, తనతో నడిచి వచ్చే యువతరం వల్ల ప్రజలకు మరింత మేలు చేయవచ్చుననే దృష్టికోణంతో ఆయన ఆ సాహసానికి ఒడిగట్టారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

First Published:  26 Jan 2024 2:51 PM IST
Next Story