Telugu Global
Andhra Pradesh

సిఎం రమేష్‌కు నిరాశే.. చంద్రబాబు ఎత్తుగడలు తెలిసి బీజేపీ జాగ్రత్తలు..?

సుజనా చౌదరి విజయవాడ లోక్‌సభ సీటును అడుగుతున్నారు. వరదాపురం సూరి ధర్మవరం, ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు సీట్లను ఆశిస్తున్నారు.

సిఎం రమేష్‌కు నిరాశే.. చంద్రబాబు ఎత్తుగడలు తెలిసి బీజేపీ జాగ్రత్తలు..?
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఎత్తుగడలు తెలిసి బీజేపీ నాయకత్వం అతి జాగ్రత్తగా అడుగులు వేయాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సిఎం రమేష్‌కు నిరాశే ఎదురయ్యేట్లు ఉంది.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తర్వాత సిఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి వంటి నాయకులు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సిఎం రమేష్‌ ప్రస్తుతం బీజేపీ నుంచి విశాఖపట్నం లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. అయితే, ఆ పార్టీ అగ్రనాయకత్వం తాజా నిర్ణయంతో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేవు.

సుజనా చౌదరి విజయవాడ లోక్‌సభ సీటును అడుగుతున్నారు. వరదాపురం సూరి ధర్మవరం, ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు సీట్లను ఆశిస్తున్నారు. అయితే ఈ ముగ్గురికి కూడా సీట్లు దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. మిత్ర పక్షాల నుంచి తనవారినే పోటీ చేయించాలనే చంద్రబాబు ఎత్తుగడను గమనించి బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుతున్నారు.

సిఎం రమేష్‌, సుజనా చౌదరి బీజేపీలో చేరినప్పటికీ టీడీపీ కోసమే పనిచేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వారు దాపరికం కూడా పాటించడం లేదు. ఇటీవల చంద్రబాబును కలవడానికి వెళ్లిన ప్రశాంత్‌ కిశోర్‌కు సిఎం రమేష్‌ తన విమానాన్ని సమకూర్చారు.

First Published:  9 March 2024 2:51 PM IST
Next Story