Telugu Global
Andhra Pradesh

కేసీఆర్ కామెంట్స్.. వైసీపీ సైలెన్స్

చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు పేలుస్తున్నారు కానీ, తమపై పక్క రాష్ట్రం నుంచి పడుతున్న సెటైర్లను మాత్రం పట్టించుకోలేదు. అందుకే వైసీపీ నుంచి ఇంకా స్పందన రాలేదు.

కేసీఆర్ కామెంట్స్.. వైసీపీ సైలెన్స్
X

ఏపీలో చీకట్లు, తెలంగాణలో వెలుగు జిలుగులు.. ఏపీలో సింగిల్ రోడ్లు, తెలంగాణలో డబుల్ రోడ్లు.. అంటూ సీఎం కేసీఆర్ సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ మాటల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని టీడీపీ అప్పుడే ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. పక్క రాష్ట్రాల నాయకులు కూడా ఏపీ ప్రభుత్వ పరిస్థితిని బహిరంగ సభల్లోనే విమర్శిస్తున్నారని, పోలిక చెప్పి మరీ ఓట్లు అడుగుతున్నారని.. ఇంకా ఏపీ ప్రభుత్వానికి చురుకుపుట్టలేదని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో వైసీపీ ఇంకా స్పందించకపోవడం విశేషం.

ప్రస్తుతం ఏపీలోని వైసీపీ నాయకుల ఫోకస్ అంతా చంద్రబాబుపైనే ఉంది. చంద్రబాబు ఏం చేస్తున్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా, ఆయనకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా, క్వాష్ పిటిషన్ పరిస్థితి ఏంటి..? అనే విషయాలు ఆరా తీస్తున్నారు. చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు పేలుస్తున్నారు కానీ, తమపై పక్క రాష్ట్రం నుంచి పడుతున్న సెటైర్లను మాత్రం పట్టించుకోలేదు. అందుకే వైసీపీ నుంచి ఇంకా స్పందన రాలేదు.

ఆమధ్య మంత్రి హరీష్ రావు ఏపీ ఉద్యోగుల పరిస్థితిపై స్పందిస్తే వెంటనే వైసీపీ నుంచి పేర్ని నాని వంటి నేతలు కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ నేరుగా ఏపీ రోడ్లు, కరెంటు కష్టాలను ప్రస్తావించారు. వైసీపీ నుంచి మాత్రం ఇంకా స్పందన రాలేదు. ప్రస్తుతానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా పూర్తిగా చంద్రబాబు చుట్టూనే తిరుగుతోంది. ఏపీలో మంత్రుల బస్సుయాత్ర కంటే, చంద్రబాబు జైలు యాత్ర, నిబంధనల ఉల్లంఘనపైనే వైసీపీ అనుకూల మీడియా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు భజన చేస్తుంటే, వైసీపీ అనుకూల చంద్రబాబుని విమర్శిస్తూనే పరోక్షంగా హైలైట్ చేస్తోంది.

First Published:  2 Nov 2023 10:38 AM IST
Next Story