ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్ టూర్.. చంద్రబాబు బేజార్..
ఈనెల 22న కుప్పం పర్యటనకు వస్తున్న సీఎం జగన్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 66 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కుప్పం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని మాటిస్తున్నారు జగన్.
ఏపీ సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని అక్కడ ఓడించాలని బలంగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయన కుప్పం విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఆమధ్య నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించినప్పుడు కుప్పంనే మొదట ఎంచుకున్నారు. ఇటీవల కుప్పంకి నిధుల వరద పారిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గానికి చేయలేని పనుల్ని.. జగన్ చేసి చూపెడుతున్నారు. అక్కడ టీడీపీని ఖాళీ చేయాలనుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలతో మొదలు..
2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాల్లో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలంటున్నారు జగన్. అందులోనూ కుప్పంలో ఓటమి ఎరుగని చంద్రబాబుని అక్కడినుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా కుప్పంలో టీడీపీని టార్గెట్ చేశారు జగన్. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి, ఎన్నికల బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కుప్పం మండల పరిషత్ వైసీపీ సొంతమైంది. ఆఖరికి మున్సిపాలిటీ కూడా టీడీపీకి రాలేదు. దీంతో సహజంగానే అక్కడ టీడీపీ నైతిక బలం దెబ్బతిన్నది. పదే పదే చంద్రబాబు కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కారణం అదే.
నిధులు, నియామకాలు..
తాజాగా ఈనెల 22న కుప్పం పర్యటనకు వస్తున్న సీఎం జగన్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 66 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ గా కూడా మార్చారు. కుప్పం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని మాటిస్తున్నారు జగన్. అదే సమయంలో ముందుగానే అభ్యర్థిని ప్రకటించి, ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే చంద్రబాబుపై సమరశంఖం పూరించారు. భరత్ ఎమ్మెల్సీగా ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనే కుప్పంలో చంద్రబాబుకి పోటీగా వైసీపీ తరపున బరిలో దిగుతారు.
తగ్గేదే లేదు..
ఇన్నాళ్లూ కుప్పంలో టీడీపీకి ఎదురే లేదు. చంద్రబాబుపై ఇతర పార్టీల నేతలు పోటీకి నిలబడినా ప్రచారం, ఇతర విషయాల్లో వెనక్కి తగ్గేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కుప్పంలో టీడీపీ నేతల్ని ఢీకొనడానికి సై అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ జెండాలకి పోటీగా వైసీపీ జెండాలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలు, ఆ తర్వాత అన్న క్యాంటీన్ విషయంలో జరిగిన విధ్వంసం.. అంతా ఇంతా కాదు. కొట్లాటలు, కేసుల వరకు వెళ్లింది వ్యవహారం. కొన్ని గ్రామాల్లో టీడీపీ మినహా ఇతర ఏ జెండా ఎగరని పరిస్థితి నుంచి ఇప్పుడు పోటా పోటీగా వైసీపీ జెండాలు కూడా కనపడుతున్నాయి. కేవలం స్థానిక నాయకులపైనే భారం వేయకుండా జగన్ కూడా నేరుగా కుప్పంకి రాబోతున్నారు. ఈసారి ఎలాగైనా చంద్రబాబుని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.