ఎమ్మెల్యేల్లో మొదలైన దడ..!
గడిచిన మూడు నెలల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు ఎంతమేరకు సఫలీకృతమయ్యారనే అంశాలన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. నివేదికల ఆధారంగా ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేయనున్నారు.
ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వర్క్‌షాప్ నిర్వహించబోతున్నారు. 3 నెలల తర్వాత నిర్వహిస్తున్న వర్క్‌షాపులో సీఎం జగన్ పలు కీలకమైన అంశాలను చర్చించనున్నారు. 3 నెలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరుపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మార్చిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకున్నారో.. ఎంత మంది ఎమ్మెల్యేలకు ప్రజాదరణ కరువైందో ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే సమావేశంనాటికి వారి పనివిధానం మార్చుకోవాలని, లేదంటే కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచ్చారు. దీంతో ఈ నెల 21వ తేదీన జరిగే వర్క్‌షాప్‌లో సీఎం జగన్ వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర సర్వే నివేదికలు సీఎం చేతికి చేరినట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును అంచనా వేయనున్నారు. 2022 మే 11న రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో కనీసం 16 నుంచి 21 రోజులు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్తూ తమ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, 20 శాతం మందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి 175 నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈనెల 21వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వంపై వర్క్‌షాప్ నేపథ్యంలో గడిచిన మూడు నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎన్నిరోజులు పర్యటించారు..? ప్రజా సమస్యలపై ఎలా స్పందించారనే అంశాలపై నివేదికలు తెప్పించుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. `వై నాట్ 175` అంటున్న వైసీపీ ఆ లక్ష్యాన్ని చేరాలంటే ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే ఆదేశించారు. గడిచిన మూడు నెలల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు ఎంతమేరకు సఫలీకృతమయ్యారనే అంశాలన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. నివేదికల ఆధారంగా ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేయనున్నారు. అనుకున్న స్థాయిలో చొరవ చూపని వారిని తప్పించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ వేగాన్ని అందుకోలేకపోతున్నారట. నియోజకవర్గంలో కనీసం వారం రోజులు కూడా పర్యటించడం లేదట. పలువురు మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదనే వాదన వినిపిస్తోంది. నెగిటివ్ ఒపీనియన్ వ్యక్తమవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. గత వర్క్‌షాప్‌లో ఎవరినీ దూరం చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పిన ముఖ్యమంత్రి, గెలిచేవారికే అవకాశమిస్తామని స్పష్టం చేశారు. ఈ లెక్కన సరైన పర్ఫామెన్స్ కనబరచని వారిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో వర్క్‌షాప్‌కి ముందునుంచే ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తోంది.