Telugu Global
Andhra Pradesh

జగన్ మాస్టర్ స్ట్రోక్

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయని పనులను జగన్ ఐదేళ్ళల్లోనే చేసి చూపించారు. నిజానికి చంద్రబాబు అనుకునుంటే ఇవేమంత కష్టమైన పనులు కూడా కాదు.

జగన్ మాస్టర్ స్ట్రోక్
X

ఈనెల 26వ తేదీన జగన్మోహన్ రెడ్డి కుప్పంలో మాస్టర్ స్ట్రోక్ కొట్టబోతున్నారు. జగన్ కుప్పంలో పర్యటించబోతున్న సందర్భంగా పెద్ద సభ కూడా ఏర్పాటుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. కుప్పం నియోజకవర్గంలో జగన్ హంద్రీ-నీవా జలాలను 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 6,300 ఎకరాలకు సాగునీరందబోతోంది. అలాగే కుప్పం-పలమనేరు నియోజకవర్గాల్లోని సుమారు 2 లక్షలమందికి తాగునీరు అందబోతోంది. దశాబ్దాలుగా చంద్రబాబునాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. చేయని పనులను జగన్ ఐదేళ్ళల్లోనే చేసి చూపించారు. మొదటిదేమో కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయటం. రెండోది కుప్పం కేంద్రంగా రెవెన్యు డివిజన్ ఏర్పాటు చేయటం.

మూడోదేమిటంటే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు, డ్రైనేజి వ్యవస్థ‌ను ఏర్పాటుచేయటం. ఇప్పుడేమో హంద్రీ-నీవా జలాలను విడుదల చేయటం. మున్సిపాలిటీని చేయమని, రెవెన్యు డివిజన్ ఏర్పాటు చేయమని సంవత్సరాలుగా జనాలు చంద్రబాబును అడుగుతున్నా పట్టించుకోలేదు. పట్టణంలో డ్రైనేజి, రోడ్లు వేయాలని ఎన్నిసార్లు అడిగినా ఉపయోగం లేకపోయింది. అలాంటిది హంద్రీ-నీవా జలాలను పారించటం అంటే ఇక కలలోని మాటనే చెప్పాలి. చిన్నచిన్న పనులను కూడా చేయని చంద్రబాబు హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా నీటిని నియోజకవర్గంలోకి మళ్ళిస్తారని ఎలా అనుకుంటారు..?

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయని పనులను జగన్ ఐదేళ్ళల్లోనే చేసి చూపించారు. నిజానికి చంద్రబాబు అనుకునుంటే ఇవేమంత కష్టమైన పనులు కూడా కాదు. చేయాలని లేదు కాబట్టే చేయలేదంతే. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నారు. ఇంటి పట్టాల పంపిణీ, జగనన్న ఇళ్ళనిర్మాణాలు, భరత్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో భరత్ ను గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని కూడా జనాలకు హామీ ఇచ్చారు. ఇది సరిపోదన్నట్లుగా బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే కుప్పం, హిందుపురం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నరేంద్రమోడీ వర్చువల్ విధానంలో ఈనెల 26వ తేదీన పనులను ప్రారంభించబోతున్నారు. తన కృషివల్లే కేంద్రం కుప్పం, హిందుపురం రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తోందని జగన్ చెప్పుకుంటే చంద్రబాబు కాదనేందుకు లేదు.

తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కళ్ళకి కనబడుతోంది కాబట్టే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని జనాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఒకఎత్తయితే కుప్పంలో చంద్రబాబు గెలవటం మరో ఎత్తుగా మారిపోయింది. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు సెంటిమెంటును ప్రయోగించి భువనేశ్వరితో మాట్లాడిస్తున్నారేమో.. లేకపోతే చంద్రబాబుకు రెస్టిచ్చి తానే పోటీచేద్దామని భువనేశ్వరి తనంట తానుగా చెప్పగలరా..? చంద్రబాబు మనసులో మాటనే భువనేశ్వరి బయటకు చెప్పారనే ప్రచారాన్ని జనాలందరూ నమ్ముతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  24 Feb 2024 5:04 AM GMT
Next Story