`గడప గడపకు` గడువు పెంపు.. - ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ వెల్లడి
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రాధాన్యతగా భావించి ఎమ్మెల్యేలతో ప్రతి నియోజకవర్గంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గడువు మరో ఐదు నెలలు పెంచి సెప్టెంబర్ వరకు అవకాశమిచ్చారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల వల్ల కూడా ఈ కార్యక్రమానికి బ్రేక్ వచ్చింది. ఈ నేపథ్యంలో గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు మరింత గడువు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. సెప్టెంబర్ వరకు గడప గడపకు కార్యక్రమం గడువు పెంచారు.
2024 ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమైనప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వెల్లడించినట్టు సమాచారం. ఆయా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ స్థానాలతో భర్తీ చేస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి.. ఎమ్మెల్యేలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. సమావేశం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తివివరాలు సమావేశం పూర్తయ్యాక తెలిసే అవకాశముంది.