మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ నుంచి పిలుపు.. లాస్ట్ ఛాన్స్..?
ఎన్నికలకి ఇక ఏడాదే సమయం ఉండటంతో బాలినేని భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీఎం జగన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి వైసీపీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 2019 నుంచి మంత్రిగా పనిచేసిన బాలినేని.. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ టైమ్‌లో తన మంత్రి పదవిని కోల్పోయారు. ఇక అక్కడి నుంచి అసలు సమస్య మొదలైంది. మంత్రి పదవి నుంచి తప్పించినా కీలక నేత కావడంతో రీజినల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతల్ని వైసీపీ అప్పగించింది. కానీ.. మంత్రి పదవి నుంచి తనని మాత్రం తప్పించి ఆదిమూలపు సురేష్‌ని కొనసాగించడంతో బాలినేని కినుకు వహించారు.
తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలకి ఇంఛార్జ్‌గా బాలినేనికి వైసీపీ బాధ్యతలు అప్పగించింది. అయినా కూడా పార్టీ నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ కో-ఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఇప్పుడు కేవలం ఒంగోలు ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. దాంతో బాలినేనిని మరోసారి బుజ్జగించేందుకు సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వచ్చి సీఎంని కలవాల్సిందిగా సీఎంవో నుంచి బాలినేనికి పిలుపు వెళ్లింది.
వాస్తవానికి గత ఏప్రిల్‌లో కూడా బాలినేనిని పక్కన కూర్చుబెట్టుకుని మరీ సీఎం జగన్ బుజ్జగించారు. మార్కాపురం సభకి సీఎం హాజరవగా.. హెలిప్యాడ్ వద్దకి వెళ్లి స్వాగతం పలికేందుకు బాలినేని ప్రయత్నించారు. కానీ పోలీసులు అనుమతించలేదు. దాంతో మనస్తాపం చెందిన బాలినేని కనీసం సభలో కూడా ఉండకుండా ఇంటికి వెళ్లిపోయారు. దాంతో సీఎం వైఎస్ జగన్ బుజ్జగించి బాలినేనిని సభా వేదికపైకి పిలిపించడమే కాదు తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలానే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడే బటన్‌ని నొక్కించి మరీ గౌరవించారు. కానీ కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఎన్నికలకి ఇక ఏడాదే సమయం ఉండటంతో బాలినేని భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీఎం జగన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. మళ్లీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించడం, ప్రకాశం, బాపట్ల జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకే బాలినేనిని పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్ తర్వాత మీడియాతో బాలినేని మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు బాలినేనిని బుజ్జగించిన సీఎం జగన్ ఇదే ఆఖరి అవకాశం అని చెప్పబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.