Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఇక మ్యానిఫెస్టో ప్రకటనకు ‘సిద్ధం’

ఈ సభలోనే వైసీపీ రానున్న ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ ఇక మ్యానిఫెస్టో ప్రకటనకు ‘సిద్ధం’
X

వైసీపీ రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలు ఒకదాన్ని మించి మరొకటి పెరుగుతున్న అశేష జనాదరణతో సక్సెస్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇక నాలుగో సభ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేస్తున్నారు. వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సభకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మ్యానిఫెస్టోను ప్రకటించనున్న సీఎం

ఇక ఈ సభలోనే వైసీపీ రానున్న ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి శనివారం స్వయంగా వెల్లడించడం గమనార్హం. మేదరమెట్లలో నిర్వహించనున్న ‘సిద్ధం’ సభకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మేదరమెట్లలో సిద్ధం సభను ఈ నెల 10వ‌ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పనుల వివరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సభలో వెల్లడిస్తారని ఆయన చెప్పారు. అదే క్రమంలో ఈ సభలోనే వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా సీఎం ప్రకటిస్తారని ఆయన తెలిపారు. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామనేది సీఎం జగన్‌ వివరిస్తారని చెప్పారు.

15 లక్షల మంది అంచనా...

మేదరమెట్లలో నిర్వహించనున్న ‘సిద్ధం’ సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉందని, ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారని ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైసీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసని, బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసని ఆయన వివరించారు. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

First Published:  2 March 2024 3:52 PM IST
Next Story