జగన్ నామినేషన్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
తర్వాత జగన్ తరపున పులివెందులలో ప్రచారం నిర్వహించనున్నారు ఆయన సతీమణి వై.ఎస్.భారతి. ఎన్నికలు ముగిసే వరకు భారతి పులివెందులలోనే ఉంటారని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. 22వ తేదీ ఉదయం 10.30 గంటలకు జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 21న కుటుంబంతో కలిసి పులివెందులకు చేరుకుంటారు జగన్. నామినేషన్ తర్వాత జగన్ తరపున పులివెందులలో ప్రచారం నిర్వహించనున్నారు ఆయన సతీమణి వై.ఎస్.భారతి. ఎన్నికలు ముగిసే వరకు భారతి పులివెందులలోనే ఉంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం మీదుగా పల్నాడు జిల్లాలో అడుగు పెట్టారు వైఎస్ జగన్. మొత్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజుకు చేరుకుంది.
ఇవాళ సత్తెనపల్లి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో జగన్ యాత్ర కొనసాగనుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏటుకూరు బైపాస్ రోడ్ సర్కిల్ దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. మరో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగిస్తారు జగన్. అక్కడ ఏర్పాటు చేసిన యాత్ర ముగింపు సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పులివెందులకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. తర్వాత మరోసారి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను జగన్ చుట్టేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.