Telugu Global
Andhra Pradesh

ఆడుదాం ఆంధ్రా.. ఇక ఏటా.. - నేడు ముగింపు వేడుకలకు సీఎం జగన్‌

మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా టోర్నీని నిర్వహించింది.

ఆడుదాం ఆంధ్రా.. ఇక ఏటా.. - నేడు ముగింపు వేడుకలకు సీఎం జగన్‌
X

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది దశకు చేరుకున్నాయి. విశాఖపట్నంలో మంగళవారం జరగనున్న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విజేతలకు బహుమతులు అందించనున్నారు. తొలుత పీఎం పాలెంలోని వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియానికి వెళ్లి క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని ముఖ్యమంత్రి వీక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ఈ పోటీలు ఇకపై ప్రతి ఏడాదీ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్‌లను ప్రభుత్వం అందించింది.

ఇక విజేతలుగా నిలిచిన జట్లకు భారీగానే నగదు బహుమతులను ప్రభుత్వం అందించనుంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రెండోస్థానంలో నిలిచిన జట్లకు రూ.3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన జట్లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనుంది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విజేతలకు రూ.2 లక్షలు, రెండో స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష, మూడో స్థానంలో నిలిచినవారికి రూ.50 వేలు బహుమతిగా అందించనుంది.

ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నె సూపర్‌ సింగ్స్‌ (సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా క్రికెట్‌లో టాలెంట్‌ హంట్‌ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో పాల్గొన్నాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనున్నారు.

First Published:  13 Feb 2024 11:37 AM IST
Next Story