జగన్ కూడా ‘రూటు’ మార్చారా?
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలన్నీ తన మీద అక్కసుతో చేస్తున్నవే అని జనాల్లో భావన కలిగేట్లుగా జగన్ ప్రయత్నిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి కూడా రూటు మార్చినట్లున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటనల్లో సడెన్‌గా రూట్లు మార్చి గొడవలకు కారణమవుతున్నారు. అయితే జగన్ మార్చిన రూటు పరిపాలన, ప్రసంగాల్లో. ఈ మధ్యనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని ప్రకటించారు. కేంద్రం నిధులిస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని లేకపోతే లేదని చెప్పేశారు. కేంద్రమే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు అందరికీ తెలుసు.
తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రతి సోమవారం చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో చాలా హడావుడి చేసేవారు. ప్రాజెక్టుకు కేంద్రానికి సంబంధం లేదన్నట్లుగా ప్రచారం చేయించుకున్నారు. చివరకు ప్రాజెక్టును పూర్తి చేయలేక చేతులెత్తేశారు. అయితే జగన్ ఈ విషయంలో జాగ్రత్తపడ్డారు. మొదటి నుండి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే అని చెబుతున్నారు. మొన్నటి పర్యటనలో పునరావాసానికి కేంద్రం డబ్బులిస్తేనే పనులు జరుగుతాయని తేల్చిచెప్పేశారు. కావాలంటే లబ్ధిదారులకు అందించాల్సిన నిధులను ఢిల్లీ నుండి నరేంద్ర మోడీయే బటన్ నొక్కి రిలీజ్ చేయచ్చని కూడా చెప్పేశారు.
అసలే విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందని జనాలు మంటమీదున్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా కేంద్రానిదే బాధ్యతని చెప్పి జగన్ చేతులు దులిపేసుకున్నారు. ఇక నాలుగున్నరేళ్ళ పాలనలో ఏవైనా తప్పులుంటే చెప్పండి సరిచేసుకుంటానని జనాలను అడిగారు. తప్పులు సరిచేసుకుంటానని అడగటం జనాల్లో సానుకూలత పెంచుతుందనే అనుకుంటున్నారు.
ఇక చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలన్నీ తన మీద అక్కసుతో చేస్తున్నవే అని జనాల్లో భావన కలిగేట్లుగా జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పనుల్లో కానీ ఇంతవరకు నిర్దిష్టంగా ఇక్కడ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి. ఎంతసేపు జగన్‌ను సైకో, అరాచకం, రాక్షుసుడు, అవినీతిపరుడు, వీరప్పన్, గజదొంగని అంటున్నారంతే. తనపైన కసితోనే చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారనేట్లుగా జనాల మైండ్ సెట్ మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి పాలన, ప్రసంగాల్లో జగన్ మార్చిన రూటు ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.