ఢిల్లీకి సీఎం జగన్.. - రేపు ప్రధాని మోడీతో భేటీ
2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కూడా జగన్ కోరే అవకాశముంది.
సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురువారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన ఆయన రాత్రికి జన్‌పథ్ నివాసంలో బస చేస్తారు. శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధాని మోడీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది. వాటిలో ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరితగతిన నిధుల విడుదల ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
వీటితో పాటు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కూడా జగన్ కోరే అవకాశముంది. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా చెల్లింపులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు మరింత ఎక్కువ ప్రయోజనం కలిగించాలని కోరే అవకాశముంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం అందించాలని, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ కోరనున్నట్టు తెలుస్తోంది.