`నాడు- నేడు`తో పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన జగన్
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జగన్ ప్రభుత్వం 2019 నవంబర్ 14వ తేదీన నాడు-నేడు పథకాన్ని ప్రారంభించింది.
సమాజ పురోగతిలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది. విద్యావంతుల సంఖ్య పెరుగుతన్న కొద్దీ సమాజంలో సానుకూలమైన మార్పులు సంభవిస్తుంటాయి. ఈ విషయం తెలిసిన నాయకుడు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. మొగ్గదశలోనే నాణ్యమైన విద్యను అందిస్తే అది ప్రాణవంతమైన సమాజానికి పాదులు వేస్తుంది. అందుకే వైఎస్ జగన్ ప్రాథమిక విద్యను సంస్కరించడానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా మన బడి, నాడు- నేడు అనే ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జగన్ ప్రభుత్వం 2019 నవంబర్ 14వ తేదీన నాడు-నేడు పథకాన్ని ప్రారంభించింది. పాఠశాలల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా డ్రాపౌట్ రేటును తగ్గించాలని ప్రభుత్వం సంకల్పించింది.
నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించే ప్రక్రియను చేపట్టారు. ఆ మౌలిక వసతులు ఇవీ...
- టాయిలెట్ల నిర్మాణం
- పాఠశాలలను విద్యుదీకరించి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం
- మంచినీటి సరఫరా
- విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్ ఏర్పాటు
- పాఠశాలల భవనాలకు పెయింటింగ్
- పాఠశాలల మరమ్మతులు
- ఆకుపచ్చ సుద్ద బోర్డుల ఏర్పాటు
- ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు
- అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీగోడల నిర్మాణం
మూడేళ్ల వ్యవధిలో దశలవారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ పథకం 2019- 20 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, జువెనైల్ వెల్ఫేర్, మత్స్యశాఖ వంటి యాజమాన్యాలు నిర్వహిస్తున్న పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో మొత్తం 44,512 పాఠశాలలను ఆధునీకీకరించాలనేది లక్ష్యం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఇందుకు దాదాపు రూ.3700 కోట్లు ఖర్చయ్యాయి.
మిగతా స్కూళ్లలో ఈ పథకం అమలు చేయడానికి నాడు-నేడు రెండో దశ కూడా ప్రారంభమైంది. అందుకు ఇటీవలే ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాదాపు 6 వేల పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు కూడా లేవు. అటువంటిది జగన్ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో ఏపీలోని పాఠశాలల రూపురేఖలే మార్చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పిల్లలు ఈ బడుల్లో చదువుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు.