Telugu Global
Andhra Pradesh

పెన్షన్ వ్యవహారంపై సీఎం జగన్ ఘాటు ట్వీట్

చంద్రబాబుకు పేదలంటే గిట్టదని, వారికి మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ అంటే అసలే పడదని విమర్శించారు సీఎం జగన్. తనను నేరుగా దెబ్బకొట్టలేక, తనకు మద్దతుగా ఉన్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు.

పెన్షన్ వ్యవహారంపై సీఎం జగన్ ఘాటు ట్వీట్
X

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒకటో తేదీ పెన్షన్లు ఆగిపోయాయి, లబ్ధిదారులు సచివాలయాలకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ పాపం టీడీపీదే అయినా చంద్రబాబు మాత్రం బుకాయింపులు ఆపలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పెన్షన్ల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. పెన్షన్లు ఆపింది చంద్రబాబేనంటూ ఆయన మదనపల్లె సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇదే విషయంపై జగన్ ట్వీట్ వేశారు.

"లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తేదీన చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!" అంటూ స్పందించారు జగన్.


మదనపల్లె సభలో..

చంద్రబాబుకు పేదలంటే గిట్టదని, వారికి మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ అంటే అసలే పడదని విమర్శించారు సీఎం జగన్. తనను నేరుగా దెబ్బకొట్టలేక, తనకు మద్దతుగా ఉన్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి? అని ప్రశ్నించారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టడం ద్వారా 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నారని, ఆమాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని ధ్వజమెత్తారు జగన్.

అన్నింటికీ అవరోధం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువుల్ని కూడా ఇలాగే అడ్డుకోవాలని చూశారని, పిల్లలకు ట్యాబ్ లు ఇస్తుంటే చూసి ఓర్చుకోలేకపోయారని అన్నారు సీఎం జగన్. చివరకు ఇళ్ల స్థలాల పంపిణీని కూడా కోర్టు కేసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ అంటేనే చంద్రబాబుకి గిట్టదని, దాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు లాంటి పెత్తందార్లకు, పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి ఈ విషయాన్ని వివరించాలని పిలుపునిచ్చారు సీఎం జగన్.

First Published:  3 April 2024 6:53 AM IST
Next Story