నేటినుంచి వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
ఈరోజు అల్లూరి జిల్లా కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో వదర బాధితులను సీఎం జగన్ పరామర్శిస్తారు. ఆ తర్వాత కుక్కునూరు మండలం గొమ్ముగూడెంకు వెళ్తారు. వరదలకు నష్టపోయిన పంట పొలాలను ఆయన సందర్శిస్తారు.
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల ప్రజలకు సీఎం జగన్ భరోసా ఇచ్చేందుకు వస్తున్నారు. ఈరోజు, రేపు.. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. రెండు రోజులపాటు ప్రజలతో నేరుగా మమేకం అవుతారు. వారి కష్టాలు వింటారు. ఈమేరకు అల్లూరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈరోజు..
ఈరోజు అల్లూరి జిల్లా కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో వదర బాధితులను సీఎం జగన్ పరామర్శిస్తారు. ఆ తర్వాత కుక్కునూరు మండలం గొమ్ముగూడెంకు వెళ్తారు. వరదలకు నష్టపోయిన పంట పొలాలను ఆయన సందర్శిస్తారు. బాధిత రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రాత్రికి ఆయన రాజమండ్రి వచ్చి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు.
రేపు..
మంగళవారం కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంకలో సీఎం జగన్ పర్యటిస్తారు. తానేలంక, రామాలయంపేటలో వరద బాధితులతో సీఎం జగన్ మాట్లాడతారు. అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు గ్రామాల్లో కూడా జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పొలిటికల్ సీన్..
పరామర్శల పర్వంలో పొలిటికల్ సీన్ కూడా ఉందని తెలుస్తోంది. ఈరోజు అల్లూరి జిల్లా వరద బాధితుల పరామర్శ అనంతరం సాయంత్రానికి సీఎం జగన్ రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ ఉభయగోదావరి జిల్లాల నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఇది పూర్తిగా పార్టీకి సంబంధించిన సమావేశం కావడం విశేషం. ఇటీవల పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్గత కలహాలు ఈ సందర్భంగా చర్చకు వస్తాయని అంటున్నారు. కాకినాడ, అమలాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు రాజకీయాలపై కూడా జగన్ దగ్గర పంచాయితీ జరిగే అవకాశముంది. ఇటీవల టాక్ ఆఫ్ ఏపీగా మారిన రామచంద్రాపురం నియోజకవర్గ వ్యవహారం కూడా జగన్ దగ్గర చర్చకు వస్తుందని అంటున్నారు. ప్రత్యేకంగా పొలిటికల్ మీటింగ్ పెట్టుకోకుండా.. వరద పరామర్శల మధ్యలో జగన్ ఈ పంచాయితీలు పూర్తి చేస్తారని తెలుస్తోంది.