Telugu Global
Andhra Pradesh

జగన్ పై రాళ్లదాడి కేసులో తొలి అరెస్ట్

స్థానిక యువకుడైన సతీష్ ని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. సతీష్ కి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు.

జగన్ పై రాళ్లదాడి కేసులో తొలి అరెస్ట్
X

సీఎం జగన్ పై రాయి వేసిన నిందితుడు సతీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయి. మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉన్నా.. విచారణ ఇంకా పూర్తి కాలేదు. అయితే రాయి వేసింది సతీష్ అని నిర్థారించి అతడిని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు.

విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో గత శనివారం రాత్రి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఎడమకంటి పై భాగంలో గాయమైంది. జగన్ కి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గాయానికి కుట్లు వేశారు. ముఖ్యమంత్రిపై దాడి జరగడంతో ఈ కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక యువకుడైన సతీష్ ని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. సతీష్ కి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు.

రాజకీయ ప్రకంపనలు..

ఓవైపు జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెబుతూనే.. మరోవైపు వెటకారమాడారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ కనీసం సానుభూతి కూడా చూపించకుండా తప్పంతా జగన్ దే అన్నట్టుగా మాట్లాడారు. ఈ దాడి వ్యవహారం రెండు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంట రాజేసింది. అటు పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపించాయి. పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగానే దాడి జరిగిందని, పోలీస్ బాస్ లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు తొలి అరెస్ట్ చూపించారు.

First Published:  18 April 2024 4:32 PM IST
Next Story