Telugu Global
Andhra Pradesh

విశాఖలో ఇక నుండి రెండు రోజులు

మార్చి 22వ తేదీకి జగన్ వైజాగ్ ఫిష్టయిపోతారట. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన క్యాంపు ఆఫీసులో జగన్ ఉండబోతున్నారు. పోర్టు గెస్ట్ హౌసే జగన్ తాత్కాలిక క్యాంప్ ఆఫీసు కాబోతోంది.

విశాఖలో ఇక నుండి రెండు రోజులు
X

విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారబోతోందా? అవుననే చెబుతున్నాయి పార్టీవర్గాలు. ఉగాది పండుగకు జగన్ విశాఖకు షిఫ్ట్‌ అయిపోతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. దానికి అనుగుణంగానే జగన్ ఇప్పుడు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మార్చి 22వ తేదీకి జగన్ వైజాగ్ ఫిష్టయిపోతారట. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన క్యాంపు ఆఫీసులో జగన్ ఉండబోతున్నారు. పోర్టు గెస్ట్ హౌసే జగన్ తాత్కాలిక క్యాంప్ ఆఫీసు కాబోతోంది.

రుషికొండలో సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోంది. దాని వెనకాలే క్యాంపు ఆఫీసు కూడా ఏర్పాటవుతోంది. అంతవరకు పోర్టు గెస్ట్ హౌస్‌లో ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని పోర్టు అథారిటితో మాట్లాడి అందుకు అవసరమైన అన్నీ అనుమతులను ప్రభుత్వం తీసుకున్నదని సమాచారం. 100 ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌస్ సీఎం తాత్కాలిక బసకు అన్నీ విధాలుగా సరిపోతుందని భద్రతాధికారులు కూడా సర్టిఫై చేశారు.

ఇందులోనే అత్యాధునిక సౌకర్యాలున్న బెడ్రూములు, డైనింగ్ హాళ్ళు, మీటింగ్ హాళ్ళు, పెద్ద కిచెన్, పదుల సంఖ్యలో వెహికల్ పార్కింగ్, సిబ్బంది ఉండేందుకు అవసరమైన గదులు అన్నీ సిద్ధంగా ఉన్నాయట. మార్చి 22వ తేదీన విశాఖకు మారబోతున్న జగన్ ప్రతి సోమ, మంగళవారాల్లో విశాఖలోనే ఉంటారు. బుధవారం పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ప్రతి బుధవారం ఏదో జిల్లాలోని గ్రామంలో రాత్రికి బసచేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.

అలాగే గురు, శుక్ర, శని, ఆదివారాలు అమరావతిలోనే ఉంటారు. సీఎంవోలో ఇప్పుడున్న ఉన్నతాధికారుల్లో ఎవరెక్కడ ఉండాలో కూడా డిసైడ్ అయిపోయిందట. అంటే ఉన్నతాధికారులను రెగ్యులర్‌గా రెండు చోట్లకు మార్చకుండా స్ధిరంగా ఉంచబోతున్నారట. అందుకనే కొందరిని వైజాగ్‌లో, మిగిలిన వాళ్ళని అమరావతిలోనే ఉంచబోతున్నారు. సెక్యూరిటి సిబ్బంది కూడా ఇదే పద్ధ‌తిలో బాధ్యతలు నిర్వహిస్తారు.

సుప్రీంకోర్టులో రాజధానిపై విచారణ ముగిసేవరకు ఇదే పద్ధ‌తిలో జగన్ రెండుచోట్లకు తిరుగుతుంటారు. విచారణ తర్వాత మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతో జగన్ ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి తీర్పు వచ్చేస్తే అప్పుడు పూర్తిస్ధాయిలో వైజాగ్‌కు మారిపోతారు. ఈలోగానే రుషికొండలో సెక్రటేరియట్, క్యాంప్ ఆఫీస్‌ అన్నీ నిర్మాణాలు పూర్తవ్వాలని జగన్ ఇప్పటికే ఆదేశించారట. మొత్తంమీద జగన్ వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా చేసుకోవటం అయితే ఖాయమైపోయింది.

First Published:  27 Feb 2023 11:03 AM IST
Next Story