Telugu Global
Andhra Pradesh

జగన్‌ దూకుడు.. గందరగోళంలో చంద్రబాబు కూటమి

టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో, అభ్యర్థుల ఎంపికలో మరింత జాప్యం జరిగితే స్థానికంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్యన సమన్వయం సాధించడం చాలా కష్టమవుతుంది.

జగన్‌ దూకుడు.. గందరగోళంలో చంద్రబాబు కూటమి
X

వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో నిలిపే అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ వెళ్తున్నారు. అత్యంత సాహసోపేతంగా అభ్యర్థులను మారుస్తున్నారు. సిట్టింగ్‌లను కూడా పక్కన పెట్టి గెలుపు గుర్రాలను నిలిపే ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ-జనసేన కూటమిని సమర్థంగా ఎదుర్కోవడానికి ముందస్తుగానే వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ, జనసేనలు మాత్రం వైసీపీ నుంచి జరిగే వలసల కోసం ఎదురుచూస్తున్నాయి. టికెట్‌ దక్కనివారు పార్టీ మారడం సహజం. వైఎస్‌ జగన్‌ వద్దనుకుని పక్కన పెట్టి నాయకులు వస్తుంటే ఆ పార్టీలు అందుకుని టికెట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో టికెట్లు ఆశిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు తీవ్ర గందరగోళానికి గురువుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య స్థానికంగా విభేదాలు వీధులకెక్కుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు దూకుడుగా ప్రజల్లోకి వెళ్తుంటే, టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపికలో జాప్యం చేస్తూ వస్తోంది. జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి రాలేదు. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో స్థానికంగా ఇరు పార్టీల నాయకుల మధ్య సమన్వయం సాధించడం అంత సులభమైన విషయం కాదనే మాట వినిపిస్తోంది.

ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లానే తీసుకుంటే... పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్‌ తనకే దక్కుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ధీమాతో ఉన్నారు. అయితే, టీడీపీ అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ రాలేదు. అదే సమయంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా పుట్టపర్తి సీటును ఆశిస్తున్నారు. అంతేకాకుండా ధర్మవరానికి చెందిన వరదాపురం సూరి పేరు కూడా వినిపిస్తోంది. కదిరి పట్టణానికి చెందిన బ్లూమూన్‌ విద్యాసంస్థ అధినేత శివశంకర్‌ ఇటీవల జనసేనలో చేరారు. సీట్ల సర్దుబాటులో భాగంగా పుట్టపర్తి సీటు జనసేనకు కేటాయిస్తారని, దానివల్ల తనకు పోటీ చేసే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పల్లె రఘునాథరెడ్డి ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్‌ పేరును ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అయితే, నకిలీ డీడీల కేసు ఆయనను వెంటాడుతోంది. దీంతో ఆయన భార్య యశోదమ్మకు టికెట్‌ ఇవ్వాలని కందికుంట అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌పాషా మైనారిటీ కోటాలో కదిరి సీటు తనకే దక్కుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇదే జరిగితే కందికుంట పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.

పరిటాల శ్రీరామ్‌కు మొండిచేయి?

మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు మొండిచేయి చూపించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ధర్మవరం టికెట్‌ తనకే దక్కుతుందని బిజెపిలో ఉన్న వరదాపురం సూరి చెబుతున్నారు. అయితే, నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న తన పరిస్థితి ఏమిటని పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నిస్తున్నారు. వరదాపురం సూరికి టికెట్‌ ఇస్తే తాము ఓడిస్తానని ఆయన వర్గం అంటోంది. పొత్తులో భాగంగా ధర్మవరం సీటును జనసేనకు కేటాయించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీంతో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

మడకశిర నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించారు. దాంతో ఈరన్నను లేదా ఆయన కుమారుడిని పోటీకి దించాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది అదే జరిగితే టీడీపీని ఓడించడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అనుచరులు అంటున్నారు.

టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో, అభ్యర్థుల ఎంపికలో మరింత జాప్యం జరిగితే స్థానికంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్యన సమన్వయం సాధించడం చాలా కష్టమవుతుంది. అదే సమయంలో పార్టీల్లో తలెత్తే అసంతృప్తి జ్వాలలను చల్చార్చడానికి కూడా తగిన సమయం లభించదు.

First Published:  5 Feb 2024 2:44 PM IST
Next Story