ఇంట్లో ఫ్యాన్.. ఇంటి బయట సైకిల్.. సింక్ లో టీ గ్లాస్
గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారని, ఇప్పుడు మళ్లీ ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు జగన్.
రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని, సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలని టీడీపీ, జనసేనకు చురకలంటించారు. గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారని, ఇప్పుడు మళ్లీ ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. రాప్తాడు సిద్ధం సభకు భారీగా జనం తరలిరాగా.. వారిని ఉత్సాహ పరుస్తూ జగన్ ప్రసంగించారు.
పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుందని చెప్పారు సీఎం జగన్. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరగబోతోందని, ఆ యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరమా అని అడిగారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదని, ఆయన పేరు చెబితే ఏ ఒక్కరికీ సామాజిక న్యాయం గుర్తురాదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతం కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు జగన్. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా అమలు కాలేదని, మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని, ఈసారి కూడా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ పేరు చెబితే ఈ 57 నెలలో జరిగిన మంచి గర్తొస్తుందని, అనేక పథకాలు ప్రజలకు గుర్తొస్తాయని వివరించారు సీఎం జగన్.
ప్యాకేజీ స్టార్ మనకెందుకు..?
సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు..? అంటూ పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చారు సీఎం జగన్. కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడేవాడే నాయకుడు అని అన్నారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేసి.. చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలు నమ్మేలా పాలించానని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. పొరపాటున కూడా చంద్రబాబు మాటలు నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పు ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తానని చెపుతాడని, ఎన్నికల ముందు చంద్రబాబు రంగు రంగుల మేనిఫెస్టో తీసుకొస్తాడని ఆ మాటలేవీ నమ్మొద్దన్నారు. చుక్కల్ని కిందకు దించుతానంటాడని, కేజీ బంగారం ఇస్తానంటాడని, చంద్రబాబు రకరకాల జిమ్మిక్కులు చేస్తాడని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు జగన్.