Telugu Global
Andhra Pradesh

కడపలో జగన్ ఉద్వేగభరిత ప్రసంగం

కడప పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజుల్ని జగన్ గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్ అని చూసిందని చెప్పారు.

కడపలో జగన్ ఉద్వేగభరిత ప్రసంగం
X

ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతున్న వేళ.. సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. కడప నియోజకవర్గంలో ఆయన ప్రసంగం ఉద్వేగ భరితంగా సాగింది. గతంలో తాను కడప పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజుల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కడపలో ఇండిపెండెంట్ గా బరిలో దిగి 5 లక్షల 45వేల మెజార్టీ సాధించానని చెప్పారు జగన్.


కడప జిల్లా రాజకీయాలు మీ అందరికీ తెలుసని చెప్పిన జగన్, కడప జిల్లాలో ఉన్న రాజకీయ చైతన్యం బహుకొద్ది జిల్లాల్లోనే ఉందన్నారు. "నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏరకంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందో నాకింకా గుర్తుంది. ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ, ఇదే కడప గడ్డపైనుంచి అప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అప్పుడు సింబల్ కూడా లేదు. కేవలం 14 రోజులే ఆ సింబల్ వచ్చినప్పుడు మీ బిడ్డకు మీరు అండగా నిలబడి 5 లక్షల 45 వేల మెజార్టీ ఇచ్చారు." అని గుర్తు చేసుకున్నారు జగన్. తాను పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్ అని చూసిందని చెప్పారు.

అంతటి చైతన్యం ఉన్న కడపజిల్లా రాజకీయాలను, ప్రజల ప్రయోజనాలను, వైఎస్ఆర్ పై అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలని చెప్పారు జగన్. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా అని అడిగారు. వైఎస్ఆర్ అనే పేరే లేకుండా చేయాలని, ఆ పేరే కనపడకూడదని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ శత్రువులు కడప జిల్లా రాజకీయాలను నిర్ణయించకూడదని చెప్పారు జగన్.

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో ఇక్కడి ప్రజలు జట్టు కట్టకూడదని చెప్పారు జగన్. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మనపై ప్రయోగించిన కాంగ్రెస్ తో కొంతమంది కలసిపోయారంటూ షర్మిలను పరోక్షంగా విమర్శించారు. ప్రత్యక్షంగా కాంగ్రెస్ తో, పరోక్షంగా చంద్రబాబుతో వారు కలసిపోయారని అన్నారు. వైఎస్ఆర్ అనే పేరు కనపడకుండా చేయాలని కుట్ర చేసినవారితో కలసి నడుస్తున్నవారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు జగన్.

First Published:  10 May 2024 11:19 PM IST
Next Story