విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు? - సీఎం జగన్
చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, తన హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ సభలో వివరించారు సీఎం జగన్. అమరావతిలో తన బినామీ భూముల కోసం చంద్రబాబు విజయవాడ అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఏపీ శాసనసభలో పాలనా వికేంద్రీకరణ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విజయవాడ అభివృద్ధి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, తన హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ సభలో వివరించారు. అమరావతిలో తన బినామీ భూముల కోసం చంద్రబాబు విజయవాడ అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
''చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడకు ఏం చేశారు? చిన అవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు వెస్ట్రన్ బైపాస్‌ను మా హయాంలో అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే 17.8 కి.మీ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా పూర్తి చేస్తాం. ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు. గొల్లపూడి నుంచి కృష్ణా నది మీదుగా బ్రిడ్జి కట్టి ఇటు వైపున ఉన్న చినకాకాని వద్ద చెన్నై హైవేను కలుస్తుంది. ఇది 18 కి.మీ దూరం. దీనికోసం మరో రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 33 శాతం పనులు పూర్తయ్యాయి.. 2024 కల్లా పూర్తి చేస్తాం. గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు రాకుండా, దీన్ని అడ్డుకున్నది ఎవరు? విజయవాడ తూర్పు భాగంలో 40కి.మీ మేర బైపాస్ ఏర్పాటు చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇది పూర్తయితే విజయవాడ చుట్టూ ఒక రింగ్‌రోడ్డు వచ్చినట్టే. దీనిపై అనేక సార్లు కేంద్రప్రభుత్వంతో స్వయంగా నేనే సంప్రదింపులు జరిపా. ఈనెలలోనే ఆమోదం లభించే అవకాశముంది. వెంటనే డీపీఆర్ పూర్తి చేసి ఆరు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తాం.
చంద్రబాబు హయాంలో ఐదేళ్ల సమయం ఉన్నా.. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. బెంజి సర్కిల్ వద్ద ఉన్న మొదటి ఫ్లై ఓవర్ ఐదేళ్లలో పూర్తి చేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక పూర్తి చేశాం. రెండో ఫ్లై ఓవర్ కూడా మేం ప్రారంభించి పూర్తి చేశాం. విజయవాడ అభివృద్ధి చెందితే అమరావతిలోని తన బినామీ భూములకు ధర ఉండదేమోనని భయపడి చంద్రబాబు విజయవాడను అభివృద్ధి చేయలేదు. విజయవాడ అభివృద్ధి చెందాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు స్పెషల్ గ్రాంట్ ఇచ్చి పనులు చేయిస్తున్నాం. కృష్ణానదికి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక ప్రాంతం మునిగిపోయేది. ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. రూ.137 కోట్లతో రిటైనింగ్ వాల్ కట్టి ముంపునకు గురికాకుండా వారిని ఆదుకున్నాం. విజయవాడ బెంజిరోడ్డు సమీపంలో.. ప్రజలు ఆహ్లాదకర వాతావారణంలో సేద తీరేందుకు రూ.260కోట్లతో అంబేడ్కర్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్ నాటికి పనులు పూర్తవుతాయి.
రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖను ఎక్కడికో తీసుకొని పోగలుగుతాం. ఎందుకంటే అక్కడ రోడ్లు, డ్రైన్లు, విద్యుత్, నీరు అందుబాటులో ఉంది. బేసిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కోసం ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. నాకు అమరావతి అయినా.. విశాఖపట్నం అయినా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అతిపెద్ద సిటీ. కానీ, విశాఖను అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారు. అమరావతిలో ఎవరూ చేయలేనిదాన్ని.. మనం చేయాలని రోజూ ధర్నాలు చేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని ప్రజలందరూ ఆలోచన చేయాలి'' అని సీఎం జగన్ వివరించారు.