Telugu Global
Andhra Pradesh

రాబోయే రోజుల్లో మోసాలు ఎక్కువవుతాయి జాగ్రత్త

చంద్రబాబు పేరు చెబితే స్కీమ్ లు కాదని, స్కామ్ లే గుర్తొస్తాయని చెప్పారు సీఎం జగన్. రాష్ట్రాన్ని దోచుకోడానికే చంద్రబాబుకి అధికారం కావాలన్నారు.

రాబోయే రోజుల్లో మోసాలు ఎక్కువవుతాయి జాగ్రత్త
X

ఏపీలో తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయని అన్నారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 తో కలసి ఇలాంటి మోసాలు ఎక్కువగా చేస్తారని చెప్పారు. ఆ అబద్ధాలు నమ్మొద్దని, మోసాలకు పడిపోవద్దని సూచించారు. తానెప్పుడూ ఎవరి మద్దతు కోరలేదని, ఎవర్నీ దేహీ అనలేదని, తాను కేవలం ప్రజల్నే నమ్ముకున్నానని చెప్పారు. పుట్టపర్తిలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు సీఎం జగన్.


చంద్రబాబు పేరు చెబితే స్కీమ్ లు కాదని, స్కామ్ లే గుర్తొస్తాయని చెప్పారు సీఎం జగన్. రాష్ట్రాన్ని దోచుకోడానికే చంద్రబాబుకి అధికారం కావాలన్నారు. బాబు హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ఇలా అన్నీ స్కాములేనని చెప్పారు. మన ప్రభుత్వంలో ఇప్పటికే రూ. 2.42 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించామన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏముందని ప్రశ్నించారు. అదే రాష్ట్రం, అదే సంపద, కానీ ప్రజలకు మేలు జరిగిందని. చంద్రబాబు హయాంలో ఈ డబ్బంతా ఎవరి జేజుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు జగన్.

చంద్రబాబు హయాంలో మన పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదన్నారు జగన్. నాడు-నేడుతో ఇప్పుడు పాఠశాలల రూపురేఖలు మార్చుకున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులు వచ్చాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించామని, ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. దిశ యాప్ తో మహిళలకు భద్రత లభించిందన్నారు. మహిళా పోలీస్ లు గ్రామాల్లోనే అందుబాటులో ఉంటున్నారని చెప్పారు జగన్.

చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువేనని చెప్పారు జగన్, దేవుడి దయతో నాలుగేళ్లు కరువు లేదని, రైతుకి ప్రతి దశలోనూ సాయం చేస్తున్నామని వివరించారు. ఒక్కో రైతుకి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం ఈరోజు విడుదల చేశారు జగన్.

First Published:  7 Nov 2023 1:51 PM IST
Next Story