నా మార్కులు 99.. నేను పరీక్షలకు భయపడతానా..?
100 మార్కుల పరీక్షలో తనకు 99 శాతం మార్కులు వచ్చాయని 99 శాతం వాగ్దానాలను తాను నెరవేర్చానని చెప్పారు సీఎం జగన్. అన్ని మార్కులు వచ్చిన స్టూడెంట్ ఎవరైనా పరీక్షలకు భయపడతారా అని ప్రశ్నించారు.
డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా అంటూ మదనపల్లె సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు సీఎం జగన్. చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు అందరం సిద్ధంగా ఉండాలని చెప్పారు. మేమంతా సిద్ధం ఆరో రోజు బస్ యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు జగన్. ఇక్కడ కనిపిస్తున్న అభిమానం.. ఒక జనసముద్రాన్ని తలపిస్తోందని చెప్పారు. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలనే సంకల్పంతో వచ్చిన సమరయోధుల సముద్రం ఇక్కడ కనిపిస్తోందని అన్నారు.
నా మార్కులు 99
100 మార్కుల పరీక్షలో తనకు 99 శాతం మార్కులు వచ్చాయని 99 శాతం వాగ్దానాలను తాను నెరవేర్చానని చెప్పారు సీఎం జగన్. అన్ని మార్కులు వచ్చిన స్టూడెంట్ ఎవరైనా పరీక్షలకు భయపడతారా అని ప్రశ్నించారు. అందుకే తాను ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొంటున్నానని వివరించారు. చంద్రబాబు 10శాతం హామీలు కూడా నెరవేర్చలేదని, 10 మార్కులతో ఉన్న ఆ స్టూడెంట్ పరీక్ష పాసవుతాడా అని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో మరో 30పార్టీలు కలిసి వచ్చినా మనకు భయం లేదన్నారు. ఇలాంటి పొత్తులను చూసి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ, ఇంటింటి అభివృద్ధి అందుకున్న పేద వర్గాలు కానీ భయపడబోరని చెప్పారు జగన్.
సూపర్ సిక్స్.. సూపర్ సెవన్
గతంలో ఇదే కూటమి కలసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటున్నారని, సూపర్ సెవన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. వదలబొమ్మాళీ అంటూ మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు పశుపతి తయారవుతున్నాడని చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వారిని నమ్మొచ్చా అని ప్రశ్నించారు. నమ్మినవారిని నట్టేట ముంచి, మరోసారి మన రాష్ట్రాని దోచుకోవాలని బాబు ప్లాన్ అని వివరించారు. బాబుకు అధికారం కావాల్సింది మంచి చేయడం కోసం కాదని, దోచుకోవడం కోసం, దాన్ని దాచుకోవడం కోసం ఆయనకు అధికారం కావాలని అన్నారు. ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలన్నారు సీఎం జగన్.