Telugu Global
Andhra Pradesh

రొయ్యకు మీసం.. బాబుకి మోసం

ఓవైపు మంచి చేసిన మనం.. మరోవైపు జెండాలు జతకట్టిన వారు తలపడబోతున్న ఎన్నికలు ఇవి అని వివరించారు సీఎం జగన్. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని అన్నారు.

రొయ్యకు మీసం.. బాబుకి మోసం
X

రొయ్యకు మీసం, బాబుకి మోసం పుట్టుకతోనే వచ్చాయని అన్నారు సీఎం జగన్. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతోనే రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి అభివృద్ధికి అసలు సంబంధమే లేదన్నారు. భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో బాబు మోసాలను వివరించి చెప్పారు జగన్. గతంలో ఇలాగే మోసం చేశారని, మరోసారి ప్రజల్ని మోసగించేందుకు కట్టగట్టుకుని వస్తున్నారని అన్నారు.


బాబు వస్తే జాబ్‌లు రావడం కాదని, ఉన్నవి కూడా ఊడిపోతాయన్నారు జగన్. 2014లో రంగురంగుల మేనిఫెస్టో ఇంటింటికీ పంపిణీ చేసిన కూటమి నేతలు హామీలు గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. జగన్‌కు అనుభవం లేదని, బాబుకు అనుభవం ఉందని ఊదరగొట్టారని.. ఇదిగో మైక్రోసాఫ్ట్‌, అదిగో సింగపూర్‌ అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టారని చెప్పారు. చంద్రబాబు సింగపూర్‌ కట్టాడా? ఏపీకి బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చిందా? ఒలింపిక్స్‌ జరిగాయా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు జగన్.

జగన్‌ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది తనకు ప్రజలిచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టు అని చెప్పారు. సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా తనతోనే ఉన్నారని అన్నారు. ఓవైపు మంచి చేసిన మనం.. మరోవైపు జెండాలు జతకట్టిన వారు తలపడబోతున్న ఎన్నికలు ఇవి అని వివరించారు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని అన్నారు. మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు అని కూడా చెప్పారు జగన్. ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవని.. చంద్రబాబు చేసే మోసాలబారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

First Published:  16 April 2024 9:41 PM IST
Next Story