అభివృద్ధి రేటులో మనమే నంబర్ వన్.. - సీఎం జగన్
దేశ జీడీపీలో గతంలో రాష్ట్ర వాటా 4.45 శాతం ఉంటే.. అది 5 శాతానికి పెరిగిందని చెప్పారు. మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పెరుగుదల నమోదైందని, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నానని జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
అభివృద్ధి రేటులో దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి అంశంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
కోవిడ్ దెబ్బకు అనేక దేశాల్లో జీడీపీ తగ్గిపోయిందని, మన దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ జీడీపీ తగ్గిపోయిందని జగన్ చెప్పారు. 2018-19లో జీడీపీ 5.36 ఉంటే.. ఇప్పుడు 6.89 శాతంగా ఉందన్నారు. జీడీపీ పరంగా గతంలో దేశంలో మన రాష్ట్రం 21వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకున్నామని ఆయన వివరించారు.
దేశ జీడీపీలో గతంలో రాష్ట్ర వాటా 4.45 శాతం ఉంటే.. అది 5 శాతానికి పెరిగిందని చెప్పారు. మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పెరుగుదల నమోదైందని, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నానని జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
కోవిడ్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మన ఆర్థిక వ్యవస్థ బాగుందని జగన్ చెప్పారు. 98.4 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచామని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా.. ఓ దొంగల ముఠా దీనిపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. గోబెల్స్ తరహాలో అబద్ధాలను నిజమని నమ్మించేలా ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగైందని సీఎం జగన్ చెప్పారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పింఛన్లు, రైతు భరోసా వంటి పథకాలతో పేదలను ఆదుకోవడం వల్లే ఏపీ పాజిటివ్ గ్రోత్ రేట్ సాధించిందని ఆయన వివరించారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం జగన్ విమర్శించారు.