Telugu Global
Andhra Pradesh

ఆ లిస్ట్ తో రెడీగా ఉండండి.. నేడే వైసీపీ నేతలకు తలంటు

అంచనాలు అందుకోలేకపోయిన ఎమ్మెల్యేలకు తలంటు తప్పదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరిని పక్కనపెట్టబోతున్నారనే విషయంపై ఈ సమావేశంలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఆ లిస్ట్ తో రెడీగా ఉండండి.. నేడే వైసీపీ నేతలకు తలంటు
X

వైనాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్. దానికి తగ్గట్టుగానే పార్టీ నేతలను, అభ్యర్థులను సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే జగన్ ఈ కసరత్తులు ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రచించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నాయకులకు చురుకు పుట్టిస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్షల్లో ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లకు ఓ స్థాయిలో క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. తాజాగా మరోసారి అదే కార్యక్రమం పెట్టారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో–ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.

ఒకటే అజెండా..

మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు, ఏమేం చేశారు, మేం చేయాలి అనే విషయాలను.. ఎమ్మెల్యేలను, కోఆర్డినేటర్లను అడిగి తెలుసుకోవడంతోపాటు, తాను సిద్ధం చేసిన ఐప్యాక్ నివేదికను కూడా జగన్ ఈ సమావేశంలో చదివి వినిపిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమమే ఉంటుందని, అంచనాలు అందుకోలేకపోయిన ఎమ్మెల్యేలకు తలంటు తప్పదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరిని పక్కనపెట్టబోతున్నారనే విషయంపై ఈ సమావేశంలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. రెబల్ ఎమ్మెల్యేల గురించి కూడా చర్చ జరుగుతుంది, అలాంటివారికి పరోక్షంగా జగన్ హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.

గృహసారథే.. విజయ సారథి..

ఆమధ్య వాలంటీర్లకు తోడుగా గృహసారథులు అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారు సీఎం జగన్. నియామకాల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే అనుకున్న టైమ్ కి నియామకాలు పూర్తి కాలేదు. ఈసారి మాత్రం ఎమ్మెల్యేలు ఆ టార్గెట్ రీచ్ కావాల్సిన పరిస్థితి. గృహ సారథులుగా నియమితులైన వారి జాబితాను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి తప్పనిసరిగా తీసుకు రావాలంటూ పార్టీనుంచి ఆదేశాలందాయి. దీంతో ఎమ్మెల్యేలు హడావిడి పడుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ మొదలుపెట్టబోతున్న క్యాంపెయిన్ పై కూడా ఈ సమావేశంలో ఓ క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

First Published:  13 Feb 2023 6:31 AM IST
Next Story