Telugu Global
Andhra Pradesh

ఈనెల 13న జగన్ సమీక్ష.. హడలిపోతున్న ఎమ్మెల్యేలు

విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జగన్ భేటీ అవుతారు. గడప గడప కార్యక్రమం ప్రోగ్రెస్ పై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారు. అసంతృప్త ఎమ్మెల్యేల వ్యవహారం కూడా ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈనెల 13న జగన్ సమీక్ష.. హడలిపోతున్న ఎమ్మెల్యేలు
X

వివిధ శాఖలపై సీఎం జగన్ సమీక్ష అంటే మంత్రులు, అధికారులు హడలిపోతారో లేదో కానీ.. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటే మాత్రం ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. గడప గడపలో చెమటోడ్చి తిరుగుతున్నా చివరకు ఐప్యాక్ టీమ్ నివేదికపైనే జగన్ నమ్మకం పెట్టుకోవడం, గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా క్లాస్ తీసుకోవడంతో వారిలో భయం మరింత పెరిగింది. తాజాగా ఈనెల 13న వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి మహూర్తం ఖరారైంది.

విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జగన్ భేటీ అవుతారు. గడప గడప కార్యక్రమం ప్రోగ్రెస్ పై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారు. అసంతృప్త ఎమ్మెల్యేల వ్యవహారం కూడా ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ నేరుగా ప్రశ్నలు సంధించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఆ ఎమ్మెల్యేల లిస్ట్ ఏంటనేది బయటకు రాలేదు కానీ, తలంటు మాత్రం గ్యారెంటీ అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి పార్టీ టికెట్ ఉంటుందా, ఊడుతుందా అనే విషయంలో కూడా ఈ సమీక్షలో తేలిపోతుంది.

‘మా నమ్మకం నువ్వే జగన్’ కి శ్రీకారం..

ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలు కాబోతోంది. ఆరోజు నుంచే గృహసారథుల పని మొదలవుతుంది. ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కూడా అదే రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. దానిపై కూడా సీఎం జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం జగన్. తాజాగా విస్తృత స్థాయి సమావేశంలో మరోసారి మార్గనిర్దేశనం చేయబోతున్నారు.

ఫైనల్ వార్నింగ్..?

గడప గడపలో యాక్టివ్ గా లేనివారికి వచ్చేసారి టికెట్ లేదని గతంలోనే స్పష్టం చేశారు సీఎం జగన్. అలాంటివారు తమ పనితీరు మార్చుకోవాలని, మరో అవకాశం ఇస్తున్నానని చెప్పి పంపించారు. చాలామంది ఆ తర్వాత గడప గడపని సీరియస్ గా తీసుకున్నారు, జనంలోకి వెళ్లారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఈసారి జరిగే సమీక్షలో ఎవరెవరి పర్ఫామెన్స్ ఎలా ఉందో జగన్ చెప్పేయబోతున్నారట. కొంతమందికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి మరో అవకాశం ఇస్తారని, ఇంకొంతమందికి టికెట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తారనే గుసగుసలు వినపడుతున్నాయి.

First Published:  9 Feb 2023 1:06 PM IST
Next Story