Telugu Global
Andhra Pradesh

మొహమాట పడని జగన్.. ఈసారి 15మందికి తలంటు

ప్రస్తుతానికి పేర్లు బయటకు రాలేదు కానీ ఈసారి 15మందికి జగన్ తలంటారని తెలుస్తోంది. పనితీరు సరిగా లేదని మార్చుకోవాలని సూచించారు. గడప గడపలో బాగా వెనకపడ్డారని సాక్ష్యాధారాలు చూపించారట.

మొహమాట పడని జగన్.. ఈసారి 15మందికి తలంటు
X

"సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, మరో 9 నెలల్లోనే ఎన్నికలు వచ్చేస్తాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి" అని సూచించారు ఏపీ సీఎం జగన్. మన టార్గెట్ 175 అని మరోసారి గుర్తు చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమని తేల్చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జగన్.. ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. సర్వే నివేదిక వినిపించారు.

15మందికి తలంటు..

గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష అంటేనే ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. ఈసారి ఎవరికి మూడిందో అని ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతానికి పేర్లు బయటకు రాలేదు కానీ ఈసారి 15మందికి జగన్ తలంటారని తెలుస్తోంది. పనితీరు సరిగా లేదని మార్చుకోవాలని సూచించారు. గడప గడపలో బాగా వెనకపడ్డారని సాక్ష్యాధారాలు చూపించారట. మరో అవకాశం ఇస్తానని, అప్పటికీ మారకపోతే టికెట్ రాదని ఖరాఖండిగా చెప్పేశారట.

మొహమాటాల్లేవు.. గెలపు గుర్రాలకే టికెట్లు..

వచ్చే 9 నెలలు అత్యంత కీలకం అని చెప్పారు సీఎం జగన్. 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలన్నారు. పనితీరు బాగుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వారికే టికెట్ ద‌క్కుతుంద‌ని చెప్పారు. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారని, కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోందని వివరించారు. ఆ మంచి కొనసాగాలంటే పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, అలా జరగాలంటే ఎమ్మెల్యేలు గెలవాలని, గెలిచే వారికే టికెట్లు అని కుండబద్దలు కొట్టారు.

జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం..

జూన్ 23నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు సీఎం జగన్. 11 రకాల సర్టిఫికెట్లు కావాల్సిన వారి వివరాలు తీసుకుని వెంటనే జారీ చేయాలని సూచించారు. దరఖాస్తు చేసిన వారి కుల, ఆదాయ ధ్రువీకరణ, జనన, మరణ, వివాహ, తదితర ధ్రువపత్రాలు ఇంటికి వెళ్లి జారీ చేయాలన్నారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హింటిచ్చారు.

First Published:  21 Jun 2023 4:39 PM IST
Next Story