పరిశ్రమల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు..
స్టార్టప్ కాన్సెప్ట్ ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. విశాఖపట్నంలో 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని సూచించారు.
ఏపీకి సాఫ్ట్ వేర్ లేదు, అండర్ వేర్ లేదు అంటూ ఆమధ్య జాకీ కంపెనీ తరలిపోయిన తర్వాత ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆ ఆపప్రధను తొలగించుకోడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో నూతన పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు జగన్. పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా నూతన పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. అంతర్జాతీయంగా మార్కెటింగ్ టై అప్ చేయగలిగితే MSME రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామని చెప్పారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే పరిశ్రమలు మరింత రాణిస్తాయని అన్నారు.
స్టార్టప్ కాన్సెప్ట్ ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. విశాఖపట్నంలో 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని సూచించారు. మంచి లొకేషన్ లోఈ భవన నిర్మాణం ప్రారంభించాలన్నారు. పరిశ్రమలశాఖ కార్యాయం కూడా అదే భవనంలో ఉండేలా చూడాలన్నారు. పోర్ట్ ఆధారిత పరిశ్రమల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
మంత్రిగారేరి..?
అయితే ఈ కీలక సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్ లేకపోవడం విశేషం. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖ మంత్రి అమర్నాథ్ అందుబాటులో లేరు.