ఏపీ వెలిగిపోతోంది.. సామాజిక ఆర్థిక సర్వే విడుదల
ఏపీలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు అధికారులు. తలసరి ఆదాయంలో భారత సగటు కూడా ఏపీకంటే తక్కువగా ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సామాజిక ఆర్థిక సర్వే విడుదలైంది. అసెంబ్లీలో సీఎం జగన్ చాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. 2022-23 ఏపీ సామాజిక ఆర్థిక సర్వేను మంత్రులు, అధికారులతో కలసి జగన్ విడుదల చేశారు.
మనమే టాప్..
ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని తెలిపారు ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్ కుమార్. జీఎస్డీపీలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర జీఎస్డీపీ రూ.13.17 కోట్లు అని చెప్పారు విజయ్ కుమార్. గతం కంటే రూ.1.18 లక్షల కోట్లు అధికంగా జీఎస్డీపీ సాధించామని వివరించారు.
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషియో ఎకనమిక్ సర్వే 2022-23ను విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/yEEuFfvrqL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 15, 2023
వృద్ధి ఇలా..
గతంతో పోల్చి చూస్తే వ్యవసాయం లో 13.18 శాతం వృద్ధి నమోదైంది. పరిశ్రమల రంగంలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపారు విజయ్ కుమార్. రాష్ట్ర ఆదాయంలో 36 శాతం వ్యవసాయ రంగం నుంచి వస్తోందని చెప్పారాయన. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందని చెప్పారు.
ఇండియాకంటే ఏపీ గణాంకాలు మిన్న..
ఏపీలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు అధికారులు. తలసరి ఆదాయంలో భారత సగటు కూడా ఏపీకంటే తక్కువగా ఉందన్నారు. ఏపీ తలసరి ఆదాయంలో 16.2 శాతం అభివృద్ధి నమోదైందని చెప్పారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామన్నారు. ఏపీలో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, వైద్య సేవల విస్తృతికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని తెలిపారు.