సిద్ధం నాలుగో సభకు వేదిక రెడీ.. కీలక ప్రకటన అక్కడినుంచేనా..?
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా.. నాలుగు ఉమ్మడి జిల్లాలలోని 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ కేడర్ ఈ సభకు హాజరవుతారు.
ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ మూడు సిద్ధం సభలు నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల సమరభేరిగా ఈ సభలు జరిగాయి. సభల ఫలితం ఏంటనేది టీడీపీ, జనసేన ఉలికిపాటు చూస్తేనే అర్థమవుతుంది. సిద్ధం సభలతో వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయింది. తాజాగా నాలుగో సిద్ధం సభకు వేదిక ఖరారైంది. మార్చి మొదటి వారంలో నాలుగో సిద్ధం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించబోతున్నారు. చిలకలూరి నియోజకవర్గ పరిధిలో ఈ మీటింగ్ జరుగుతుంది.
కీలక ప్రకటన అప్పుడేనా..?
ఇటీవల రాప్తాడులో జరిగిన మూడో సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తారని ఆశించారంతా. కానీ అక్కడ అలాంటి ప్రకటన ఏదీ లేదు. కనీసం కొత్త కార్యక్రమాలపై చిన్న హింట్ కూడా ఇవ్వలేదు సీఎం జగన్. నాలుగో సభలో ఈ కీలక ప్రకటన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోపై మాజీ మంత్రి కొడాలి నాని వంటి నేతలు హింట్లిచ్చారు. వైసీపీ మేనిఫెస్టో అదిరిపోయేలా ఉంటుందని, దాన్ని చూసి టీడీపీ వణికిపోతుందని చెప్పారు. మరి దీనిపై జగన్ ఎప్పుడు ప్రకటన చేస్తారనేది ఆసక్తిగా మారింది. నాలుగో సిద్ధం సభ అందుకు వేదిక అవుతుందని అంటున్నారు.
చిలకలూరి పేట నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సిద్ధం సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా.. నాలుగు ఉమ్మడి జిల్లాలలోని 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ కేడర్ ఈ సభకు హాజరవుతారు. రాప్తాడు సభను మించి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగు ముఖ్యమైన ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తయిన తర్వాత పార్టీ కీలక సమావేశం జరుగుతుంది.