ఆ మేనిఫెస్టో చదివి వినిపించిన సీఎం జగన్..
మేనిఫెస్టోలో ఒక్కో పాయింట్ చదివి మరీ చంద్రబాబు పరువు తీశారు సీఎం జగన్.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది, టీడీపీ సూపర్ సిక్స్ అంటూ బరిలో దిగింది, మరి వైసీపీ సంగతేంటి..? వైసీపీ మేనిఫెస్టోలో ఏమేం కొత్త హామీలుంటాయి..? ఆ ఆసక్తి ఇంకా అలాగే ఉంది. మేనిఫెస్టోపై ఇంకా సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకున్నట్టు లేదు. అయితే గుడివాడ 'మేమంతా సిద్ధం' సభలో మాత్రం సీఎం జగన్.. 2014 టీడీపీ మేనిఫెస్టో చదివి వినిపించారు. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్, మోదీ ఫొటోలున్నాయని, కింద చంద్రబాబు సంతకం కూడా ఉందన్నారు. మేనిఫెస్టోలో ఒక్కో పాయింట్ చదివి మరీ చంద్రబాబు పరువు తీశారు జగన్.
2014 ఎన్నికల్లో కూడా ఇదే కూటమి బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదని సభకు వచ్చిన ప్రజలతోనే చెప్పించారు సీఎం జగన్. ఇలా ఇలా ఇలా ఇలా చేతులు ఊపండి అంటూ వారిని ఉత్సాహపరిచారు. రుణమాఫీపై మొదటి సంతకం అన్నారు, అయిందా అని ప్రజల్ని ప్రశ్నించారు జగన్. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? అని అడిగారు. పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తానన్నారు, చేశారా..? అని అడిగారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నారని, అది కూడా అటకెక్కించారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. నిరుద్యోగి ఉన్న ప్రతి ఇంటికి చంద్రబాబు లక్షా 20వేల రూపాయలు బకాయి పెట్టారన్నారు. పక్కా ఇల్లు, పదివేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్, ఉమన్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రతి నగరంలో హైటెక్ సిటీ వంటి హామీలను చదివి వినిపించి, అవేవీ అమలుకాలేదనే విషయాన్ని ప్రజలతోనే చెప్పించారు సీఎం జగన్.
2014లో వచ్చిన కూటమి, మళ్లీ ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు తిరిగి వస్తోందని, వారి హామీలను ఎవరూ నమ్మి మోసపోవద్దని చెప్పారు సీఎం జగన్. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ కొత్త హామీలతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారని చంద్రబాబుపై మండిపడ్డారు.