అక్కడ కాదు, ఇక్కడ దిగుదాం సెల్ఫీ.. చంద్రబాబు కి జగన్ కౌంటర్
టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజల సొమ్ము తన జేబులో వేసుకున్న చంద్రబాబు.. ఇళ్ల స్థలాలను పేదలకు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు సీఎం జగన్. తమ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలముందు సెల్ఫీ దిగే నైతికత చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు.
ఇటీవల చంద్రబాబు నెల్లూరు పర్యటనలో టిడ్కో ఇళ్ల దగ్గర నిలబడి సెల్ఫీ దిగారు. తన హయాంలో కట్టిన ఇళ్లు అవి అని, జగన్ సీఎం అయ్యాక ఎంతమందికి ఇళ్లు కట్టించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఈరోజు మార్కాపురంలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల సభలో సీఎం జగన్ ఆ ఛాలెంజ్ కి బదులిచ్చారు. ఎవరి హయాంలో ప్రజలకు మంచి జరిగిందనే విషయంలో ఛాలెంజ్ స్వీకరించే సత్తా చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామానికి వెళ్లినా, ఏ జిల్లాలో చూసినా.. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత..? ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత..? అని బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.
ఇళ్ల స్థలాలు ఎందుకివ్వలేదు..?
ఏపీలో ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలుసన్నారు సీఎం జగన్. అందుకే నిజాలు దాస్తూ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిందలు, అబద్ధాలతో ప్రచారాలకు దిగుతున్నారని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5.. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి, నిజాలంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు జగన్. ఈ అబద్ధాల బ్యాచ్ ను ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించాలని, నిలదీయాలని సూచించారు. చంద్రబాబు హయాంలో ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఎందుకు ఇ్వలేకపోయారనన్నారు జగన్. తమ హయాంలో 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు.
అక్కడ సెల్ఫీ దిగుదామా..?
టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజల సొమ్ము తన జేబులో వేసుకున్న చంద్రబాబు.. ఇళ్ల స్థలాలను పేదలకు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు సీఎం జగన్. తమ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలముందు సెల్ఫీ దిగే నైతికత చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలకు ఏం మంచి చేశాడని ఆయన స్టిక్కర్ ని ఇంటి దగ్గర వేయాలో అడగాలన్నారు జగన్. తమ హయాంలో చేసిన మంచిని ప్రజలకు వివరించి వారి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. ఆ నమ్మకం ఉంటేనే ఓటు వేయమని అడిగే ధైర్యమున్న సర్కారు తమదేనన్నారు జగన్.