ఎమ్మెల్సీ ఫలితాలపై జగన్ రియాక్షన్ రేపు..
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన టైమ్ లో టీడీపీ చేస్తున్న హడావిడికి కచ్చితంగా జగన్ కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ ఓటమిని ఆయన ఎలా విశ్లేషిస్తారో తేలిపోతుంది.
ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాలపై అధికార పక్షం పెద్దగా హడావిడి చేయడంలేదు. రెండు స్థానాలు గెలిచిన టీడీపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేస్తోంది. మార్పు మొదలైందని, జగన్ దిగిపోవడం ఖాయమని అంటున్నారు టీడీపీ నేతలు. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ ఈ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారు. ప్రజా తీర్పుని ఆమోదిస్తాం, అవసరమైతే పాలనలో మార్పులు చేసుకుంటాం అంటారా..? లేకపోతే అసలీ ఎన్నికల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఉపాధ్యాయ స్థానాల్లో సత్తా చూపించాం అని సర్ది చెప్పుకుంటారా..? జగన్ రియాక్షన్ ఏంటో రేపు తేలిపోతుంది.
జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్ రేపు నిధులు విడుదల చేయబోతున్నారు. ఈరోజే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తారు జగన్. జగనన్న విద్యాదీవెన నాలుగో విడతను ఘనంగా నిర్వహిస్తామంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలు అందించబోతున్నట్టు తెలిపారు.
గతంలో సంక్షేమ కార్యక్రమాల సందర్భంగా సీఎం జగన్ పెద్దగా రాజకీయ ప్రసంగాలు చేసేవారు కాదు. ఇటీవల ఆయన కూడా విమర్శల డోసు పెంచారు. దుష్టచతుష్టయం అంటూ మొదలు పెట్టి ఒక్కొక్కరికీ వాయించేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన టైమ్ లో టీడీపీ చేస్తున్న హడావిడికి కచ్చితంగా జగన్ కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ ఓటమిని ఆయన ఎలా విశ్లేషిస్తారో తేలిపోతుంది. ఒకవేళ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించకుండా పక్కనపెడితే మాత్రం అతి విశ్వాసానికి భవిష్యత్తులో ఎంతో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదనే చెప్పాలి.