ఇటు చెల్లెలు, అటు తమ్ముడు.. జగన్ ఎటువైపు..?
వన్ కజిన్ అగైనెస్ట్ అనదర్ కజిన్ అనేది ఇక్కడ జరుగుతోందని, ఇటువైపు తన చెల్లెలు ఉంటే, అటువైపు తమ్ముడు ఉన్నారని.. తాను న్యాయం వైపు ఉన్నానని వివరించారు జగన్.
సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు..? అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న సూటి ప్రశ్న. వైఎస్ వివేకా హత్యకేసు విషయంలో జగన్ ని ఇరుకున పెట్టేందుకు ఇలాంటి చాలా ప్రశ్నల్ని ఎల్లో మీడియా సంధిస్తోంది. వీటన్నిటికీ ఒకటే సమాధానం చెప్పారు సీఎం జగన్. చెల్లెళ్లకు న్యాయం చేసేందుకు వేరేవాళ్లకు అన్యాయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. అవినాష్ రెడ్డి చెబుతున్నది నిజం అని తాను నమ్ముతున్నానని, ఆయన వివరణ విన్న ఎవరికైనా అది కరెక్ట్ అనిపిస్తుందని చెప్పారు. వన్ కజిన్ అగైనెస్ట్ అనదర్ కజిన్ అనేది ఇక్కడ జరుగుతోందని, ఇటువైపు తన చెల్లెలు ఉంటే, అటువైపు తమ్ముడు ఉన్నారని.. తాను న్యాయం వైపు ఉన్నానని వివరించారు జగన్.
వివేకా హత్యకేసు విషయంలో వైరి వర్గాలు చేస్తున్న విమర్శలు, వారు లేవనెత్తిన అనుమానాలకు.. అన్నిటికీ అవినాష్ రెడ్డి సమాధానం ఇచ్చారని, ఆ సమాధానం వింటే ఆయన చెప్పేది నిజం అని ఎవరికైనా నమ్మకం కుదురుతుందన్నారు జగన్. తన సోదరి సునీత చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని అన్నారాయన. కడప ప్రజలకు అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని చెప్పారు. రాజకీయ శూన్యత సృష్టించి, వివేకం చిన్నాన్న హత్య కేసును ఒక రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికను కడప సెంట్రిక్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు జగన్.
వివేకా హత్య జరిగిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది అయినా కూడా హంతకుడిని పట్టుకునే క్రమంలో ఎందుకింత ఆలస్యమైందన్న ప్రశ్నకు కూడా వివరణ ఇచ్చారు సీఎం జగన్. వివేకా హత్య జరిగిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు 3 నెలలు టైమ్ ఉందని, ఆలోగా చాలా పరిణామాలు జరిగాయన్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతుంటే.. కావాలనే కేసుని సీబీఐకి అప్పగించాలని కోర్టులో కేసులు వేశారని చెప్పారు. వారి కోరిక మేరకే సీబీఐ విచారణ జరిగిందని, దాన్ని కూడా సక్రమంగా కొనసాగించకుండా చేశారన్నారు. వివేకా రెండో భార్య, కొడుకు వివరాలన్నీ విచారణలో తెలుస్తాయి కదా అని చెప్పారు. అవన్నీ బయటకు రాకుండా కేవలం అవినాష్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసి ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నారని, అవినాష్ కి ఎవరు మద్దతుగా మాట్లాడినా, వారిపై కూడా నిందలు వేస్తున్నారని అన్నారు జగన్.