పొత్తులు, ఎత్తులు, కుయుక్తులు.. జగన్ పంచ్ డైలాగ్స్
స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు ప్రజల వద్దకు వచ్చి తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు సీఎం జగన్.
ఆమధ్య ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ఎక్కడా ప్రతిపక్షాల పేర్లు ప్రస్తావించలేదు. దీంతో ఆయన రూటు మార్చారని అనుకున్నారంతా. కానీ ఈరోజు మళ్లీ పాత జగన్ బయటకొచ్చారు. ప్రతిపక్షాలకు చాకిరేవు పెట్టారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5.. అంటూ అందర్నీ కలిపి వాయించేశారు. పనిలో పనిగా దత్తపుత్రుడు కాన్సెప్ట్ ని కూడా తెరపైకి తెచ్చారు. పవన్ కల్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
నేనొక్కడినే.. వాళ్లు ఎంతమందో..
తన ఒక్కడిని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు చేతకావడంలేదని, అందుకే వారంతా కలసి వస్తున్నారని, పొత్తులు, ఎత్తులు, కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు సీఎం జగన్. తోడేళ్ల గుంపు తనపైకి వస్తోందని, కానీ మీ బిడ్డ జగన్ కు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. తాను పొత్తులపై ఆధారపడనని, ప్రజలతోనే తనకు పొత్తు ఉంటుందన్నారు.
స్కాములు తప్ప స్కీములు తెలియవు..
ఫ్యామిలీ డాక్టర్ వంటి మంచి స్కీముల్ని తమ ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని.. అయితే స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు ప్రజల వద్దకు వచ్చి తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు సీఎం జగన్. వారి మాటలు పట్టించుకోవద్దని, మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు భావిస్తే వైసీపీకి ఓటు వేయండి అని చెప్పారు జగన్. తాను చేసేదే చెప్తానని, చెప్పిందే చేస్తానని వివరించారు.