Telugu Global
Andhra Pradesh

కమ్మ వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకునేందుకు సీఎం జగన్ ప్లాన్ వేశారా?

మొదటి నుంచి వైఎస్ జగన్ కమ్మ వర్గాన్ని విస్మరించక పోయినా.. మీడియాలో ఆ వర్గానిదే ఆధిపత్యం కావడంతో వ్యతిరేక వార్తలు మాత్రం వస్తుండేవి.

కమ్మ వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకునేందుకు సీఎం జగన్ ప్లాన్ వేశారా?
X

ఉమ్మడి ఏపీ సహా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కమ్మ సామాజిక వర్గమే అనేక ఏళ్లు అధికారంలో ఉన్నది. ఎన్టీఆర్, చంద్రబాబు ఉన్నంత కాలం ఆ సామాజిక వర్గం రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో ఎదిగింది. వైఎస్ఆర్ హయాంలో కూడా వారిని పూర్తిగా వదిలేయలేదు. ఇక తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఆ వర్గం దూరం కాకుండా కాపాడుకున్నారు. వైఎస్ జగన్ ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత కమ్మ వర్గాన్ని పూర్తిగా ఏమీ దూరం పెట్టలేదు. వారికి మంత్రి పదవితో పాటు సరైన ప్రాధాన్యతనే కల్పించారు.

మొదటి నుంచి వైఎస్ జగన్ ఆ వర్గాన్ని విస్మరించక పోయినా.. మీడియాలో ఆ వర్గానిదే ఆధిపత్యం కావడంతో వ్యతిరేక వార్తలు మాత్రం వస్తుండేవి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకో, వ్యక్తికో ఏది జరిగినా.. దాన్ని ఆ వర్గపు మీడియా భూతద్దంలో చూపెట్టేది. దీంతో కమ్మ వర్గాన్ని వైఎస్ జగన్ దూరం పెడుతున్నారని.. వైసీపీ అంటే కమ్మ వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడిపోయింది. కాస్త ఆలస్యంగా అయినా ఈ ప్రచారాన్ని గ్రహించిన సీఎం జగన్ ఇప్పుడు వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో బీసీ, ఎస్సీ ఓటర్లే ఎక్కువగా ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కమ్మ, కాపు ఓటర్లే విజయాలను శాసించే స్థితిలో ఉన్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన నాయకులు అంగ, అర్థబలం కలిగి ఉండటంతో వారిని వదులు కోవడం అంత మంచిది కాదని జగన్ గ్రహించారు. కాపు సామాజిక వర్గానికి సాధ్యమైనంత చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని బుజ్జగించే పనిలో పడ్డారు.

వైసీపీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్‌కు తాజాగా ఎమ్మెల్సీ సీటిచ్చారు. చాలా కాలం నుంచి ఆయన పార్టీనే నమ్ముకొని ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతోనే సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే వార్తలు వచ్చాయి. కానీ, ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్ ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. పార్టీని నమ్ముకొని ఉంటే తప్పకుండా పదవులు దక్కుతాయనే సందేశాన్ని కూడా మర్రి రాజశేఖర్ ద్వారా జగన్ పంపించినట్లు అయ్యింది.

ఇక మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం గత కొన్నాళ్లుగా వివాదంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ టీడీపీకి చెందిన దేవినేని ఉమా మహేశ్వరరావు బలమైన కమ్మ వర్గపు నేతగా ఉన్నారు. రెండు సార్లు మైలవరం నుంచి గెలవడమే కాకుండా.. గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. అలాంటి వ్యక్తిని ఓడించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వైఎస్ జగన్ మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ, తొలి సారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానికి ఛాన్స్ దక్కింది. రెండో దఫాలో అసలు ఆ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానమే లేకుండా పోయింది.

నానిని తీసేసిన తర్వాత కూడా వసంతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు బహిరంగంగానే విమర్శలు చేశారు. కానీ, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇటీవల వెంకట కృష్ణ ప్రసాద్‌ను సీఎం జగన్ స్వయంగా పిలిచించుకొని మాట్లాడినట్లు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని.. గెలిస్తే మంత్రి పదవి కూడా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాతే వసంత తన నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించినట్లు చర్చ జరుగుతోంది.

ఇలా కమ్మ వర్గపు నేతలకు ప్రాధాన్యత ఇస్తూ.. వారిని పార్టీ నుంచి చేజారకుండా చూసుకుంటున్నారని.. అదే సమయంలో ఆ వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నాననే సంకేతాలు కూడా పంపిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఆ వర్గపు ఓట్లను వైసీపీ నుంచి దూరం చేయకుండా కాపాడే ప్లాన్స్ అని తెలుస్తోంది. అన్ని వర్గాల ఓటర్లు ఓటేస్తేనే ఈ సారి ఎన్నికల్లో అధికారానికి దూరం కాకుండా ఉంటామని వైఎస్ జగన్ కూడా భావించారు. అందుకే బుజ్జగింపు రాజకీయాలకు తెరతీసినట్లు తెలుస్తున్నది. ఏదేమైనా జగన్ ఇలా చేయడం పార్టీకి మంచిదే అని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  23 Feb 2023 9:44 AM IST
Next Story