Telugu Global
Andhra Pradesh

వైనాట్ 175.. దమ్ముంటే పోటీ చేయండి

“వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది.” ఎవరివైపు ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నారు జగన్.

వైనాట్ 175.. దమ్ముంటే పోటీ చేయండి
X

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి సవాల్ విసురుతున్నా. 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా?” అని అన్నారు సీఎం జగన్. తెనాలిలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారాయన. ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని, ఆ ధైర్యంతోనే వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరతామని చెబుతున్నానన్నారు.

ఇప్పుడెలా సాధ్యమైంది..?

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఒకటేనని.. కానీ ఆయన హయాంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని, తాను అమలు చేసి చూపిస్తున్నానని చెప్పారు జగన్. అప్పుడు చంద్రబాబు సంక్షేమ పథకాలు ఎందుకు పెట్టలేకపోయాడని, ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అదే బడ్జెట్‌, అదే రాష్ట్రం, తేడా ఏంటో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు.

మంచి జరిగిందని నమ్మితేనే తోడుగా ఉండండి..

తన పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలని ప్రజలకు సూచించారు సీఎం జగన్. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తేనే తోడుగా ఉండండి అని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకోండని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. “మీ బిడ్డకు భయంలేదు. నా దగ్గర ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లేదు.. దతపుత్రుడు లేడు. అయినా సరే.. మేము చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తాం” అని అన్నారు జగన్.

అసూయకు మందులేదు..

వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందని, అలాంటి కడుపు మంటకు, అసూయకు మందుల్లేవని ఎద్దేవా చేశారు.

“వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది.” ఎవరివైపు ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నారు జగన్.

First Published:  28 Feb 2023 4:23 PM IST
Next Story