దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే..
గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు సీఎం జగన్.
జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేని చెప్పారు సీఎం జగన్. సామాజిక పెన్షన్ రూ.3వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. నెలకు రూ.2వేల కోట్లు పెన్షన్లలకే కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేపట్టిన జగన్.. ఈరోజు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ గతంలో ఎలా జరిగింది, ఎంతమందికి ఇచ్చారు..? ఇప్పుడు పెన్షన్ల పథకం ఎలా అమలవుతోందనే విషయాన్ని ఆయన వివరించారు.
గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు సీఎం జగన్. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామని, 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీ ఉదయమే పెన్షన్ అందించిందని చెప్పారు.
చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా పెన్షన్ ఇస్తానంటాడని, ఆ విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని వివరించారు సీఎం జగన్. తన హయాంలో 99 శాతం హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. రంగు రంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మెద్దని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని, విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయని, వాటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నానని చెప్పారు జగన్.
ఈసందర్భంగా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు సీఎం జగన్ కు పలు సూచనలు చేశారు. గతంలో వికలాంగులకు పెన్షన్ ఎక్కువ ఉండేదని, ఇప్పుడు సాధారణ పెన్షన్ తో సమానమైందని, వికలాంగులపై కాస్త దయచూపాలని కోరారు. కార్యకర్తల విషయంలో మరింత శ్రద్ధ చూపించాలని ఓ వికలాంగ కార్యకర్త జగన్ కి విన్నవించారు.