Telugu Global
Andhra Pradesh

యూత్ పై జగన్ టార్గెట్ పెట్టారా..?

కాలేజీ కెప్టెన్స్ పేరుతో వైసీపీలోని యువజన విభాగం కాలేజీ యూత్ ను ఆకర్షించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి కాలేజీకి వెళ్ళి జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను పదేపదే చెబుతున్నది.

యూత్ పై జగన్ టార్గెట్ పెట్టారా..?
X

యువ ఓటర్లపై జగన్మోహన్ రెడ్డి కొత్తగా టార్గెట్ పెట్టారు. చాపకింద నీరులా వ్యవహారమంతా జరిగిపోతోంది. సమాజంలోని వివిధ వర్గాలను ఆకర్షించటంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, ఐటీ పరిశ్రమలను తీసుకురావటం, ఫార్మా కంపెనీల ఏర్పాటు, సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయించటం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల జోరు పెంచుతున్నారు. ఎల్లోమీడియా ఏడుపు కారణంగా జరుగుతున్న అభివృద్ధికి సరైన ప్రచారం రావటం లేదంతే. ఈ విషయాలను వదిలేస్తే రాబోయే ఎన్నికల్లో యూత్ ఓటర్లపైన జగన్ ప్రత్యేకంగా టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో మొదటిసారి ఓట్లేయబోయే యూత్ సుమారు 8 లక్షలుంటారు. వీళ్ళంతా కాలేజీల్లో చదువుతున్న వాళ్ళే. డిగ్రీ మొదలుకుని పీజీ కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రొఫెషనల్ కోర్పులు చదువుతున్న వాళ్ళే ఎక్కువున్నారు. అందుకనే కాలేజీ కెప్టెన్స్ పేరుతో వైసీపీలోని యువజన విభాగం కాలేజీ యూత్ ను ఆకర్షించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి కాలేజీకి వెళ్ళి జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను పదేపదే చెబుతున్నది.

నాడు-నేడు కార్యక్రమంలో రూపురేఖ‌లు మారిపోయిన వేలాది స్కూళ్ళ గురించి వివరిస్తున్నారు. కాలేజీల్లో చదివే యూత్ లో ఎక్కువ గ్రామీణ, పట్టణ ప్రాంతాల నేపథ్యం ఉన్నవారుంటారు. కాబట్టి తమ ఊర్లలో మారిన స్కూళ్ళ రూపురేఖలను నేరుగా చూసేవుంటారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంటు పథకంలో లబ్దిదారులు లక్షల్లో ఉంటారు. తమ ఇళ్ళల్లో స్కూళ్ళు చదవుతున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళకు అందుతున్న అమ్మఒడి, విద్యాదీవెన పథకాల గురించి యూత్ కు తెలీకుండా ఉండదు.

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థులకు అందుతున్న సాయం గురించి కూడా తెలిసే ఉంటుంది. అయినా సరే ఈ వివరాలన్నింటినీ వైసీపీ యువజన విభాగం ప్రతి కాలేజీకి వెళ్ళి విద్యార్థులకు పదేపదే వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కాకుండా ప్రతిపక్షాలు గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వివరిస్తున్నారు. 2014-19 మధ్య చంద్రబాబునాయుడు పాలనను గుర్తుచేస్తున్నారు. హామీలిచ్చి తుంగలో తొక్కిన విషయాలను వివరిస్తున్నారు. వేలాదిమంది యూత్ కు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, 2.5 లక్షలమంది వాలంటీర్లను నియమించిన విషయాలను కూడా చెబుతున్నారు. కాలేజీల్లో చదవే యూత్ 8 లక్షలే అయినా వాళ్ళ కుటుంబసభ్యులతో కలిపితే సుమారు 25 లక్షల మంది ఓటర్లవుతారు. మరి జగన్ టార్గెట్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

First Published:  6 Feb 2024 5:07 AM GMT
Next Story