Telugu Global
Andhra Pradesh

విదేశీ విద్యా దీవెన‌కు సీఎం జ‌గ‌న్ శ్రీ‌కారం

జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని ముఖ్య‌మంత్రి తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఒక్క చదువేనని, పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని ఆయ‌న చెప్పారు.

విదేశీ విద్యా దీవెన‌కు సీఎం జ‌గ‌న్ శ్రీ‌కారం
X

'జగనన్న విదేశీ విద్యా దీవెన'కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం శ్రీ‌కారం చుట్టారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-200 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను విడుద‌ల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించేలా అవ‌కాశం క‌ల్పించామ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చెప్పారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని ముఖ్య‌మంత్రి తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఒక్క చదువేనని, పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని ఆయ‌న చెప్పారు. విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అ‍డ్మిషన్లు పొందారని, వీరందరికి తొలి విడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురవేయాలని.. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు.

పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. విద్యపై పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరులపై పెట్టినట్టేనని సీఎం తెలిపారు. కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా అవి మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేడ్క‌ర్‌ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. అందుకే పేద పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.

గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. 2016-17లో రూ.300 కోట్లు బకాయిలు పెట్టారని సీఎం వైఎస్ జ‌గ‌న్ గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్యూషన్‌ ఫీజు వంద శాతం రీయింబర్స్‌మెంట్స్‌ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రతి విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

First Published:  3 Feb 2023 3:07 PM IST
Next Story