Telugu Global
Andhra Pradesh

అంతర్జాతీయ మ్యాప్‌లోకి గండికోట.. సీఎం జగన్

ఒబెరాయ్ హోటల్ నిర్మాణంతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. గండికోటకు మరో స్టార్ గ్రూప్ ను కూడా తీసుకువస్తామని తెలిపారు.

అంతర్జాతీయ మ్యాప్‌లోకి గండికోట.. సీఎం జగన్
X

కడప జిల్లాలోని గండికోట అంతర్జాతీయ మ్యాప్ లోకి వెళుతుందని సీఎం జగన్ అన్నారు. గండికోటలో రూ. 250 కోట్లతో ఒబెరాయ్ హోటల్స్ నిర్మించనున్న సెవెన్ స్టార్ హోటల్ కు ఇవాళ సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం విశాఖపట్నం, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్టార్ హోటల్, విల్లాల నిర్మాణంతో గండికోట అంతర్జాతీయ మ్యాప్ లోకి వెళ్తుందన్నారు. గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పారు.

ఒబెరాయ్ హోటల్ నిర్మాణంతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. గండికోటకు మరో స్టార్ గ్రూప్ ను కూడా తీసుకువస్తామని తెలిపారు. గండికోటలో గోల్ఫ్ కోర్టును ఏర్పాటు చేయాలని ఒబెరాయ్ ని కోరినట్లు సీఎం జగన్ తెలిపారు. త్వరలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాబోతున్నట్లు ప్రకటించారు.

కాగా, రాయల వంశస్థుల కాలంలోనే గండికోట నిర్మాణం పూర్తయింది. కొన్ని వందల సంవత్సరాలు వైభవాన్ని చూసిన గండికోట ఆ తర్వాత మొఘలుల రాకతో పతనాన్ని చవిచూసింది. ముస్లిం రాజులు గండికోటలోని ఆలయాలను కూల్చివేశారు. కోట నడి బొడ్డులో జుమ్మా మసీదు కట్టారు.

ఆ తర్వాత రాజుల పాలన ముగిసి బ్రిటిష్ వారి రాక తర్వాత గండికోటను పట్టించుకున్న వారు కరువయ్యారు. అక్కడ ఒక పెద్ద కోట ఉంది.. దానికి శతాబ్దాల చరిత్ర ఉన్నదన్న విషయం కూడా పర్యాటకులకు తెలియకుండా పోయింది.

అయితే కడప జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ గండికోటకు పునర్వైభవం వచ్చింది. ఆయన హయాంలో ఇక్కడ హోటళ్ల నిర్మాణంతోపాటు కోటలో అభివృద్ధి పనులు చేపట్టడంతో క్రమంగా కోటను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది.

ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న గండికోట ప్ర‌స్తుతం ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోటలో మరిన్ని అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పుడు ఏకంగా అక్కడ రూ.250 కోట్లతో స్టార్ హోటల్, 120 విల్లాల నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో గండికోట పర్యాటకంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచనుంది.

First Published:  9 July 2023 1:37 PM IST
Next Story