వివేకా రెండో పెళ్లి, వైఎస్సార్ వారసులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోందన్నారు సీఎం జగన్. పసుపు మూకలతో నా చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం అన్నారు.
నామినేషన్‌కు ముందు పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీసేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని అన్నారు. ఆ మహానేతకు అసలు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలే అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు తన ఇద్దరు చెల్లెమ్మలు కూడా ఈ కుట్రలో భాగం అయ్యారని చెప్పారు జగన్.
వీళ్లా వైఎస్సార్ వారసులు..?
బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోందన్నారు సీఎం జగన్. పసుపు మూకలతో నా చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం అన్నారు. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు? అని ప్రశ్నించారు. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు జగన్.
అవినాష్ ఏ తప్పు చేయలేదు..
చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసున్నారు జగన్. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరో కూడా తెలుసన్నారు. వివేకాకు రెండో భార్య ఉందన్నారు జగన్. సంతానం ఉంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారో కూడా అందరికీ తెలుసన్నారు. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు నిజమే కదా అన్నారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని, అతన్ని కనుమరుగు చేయాలని చూడటం ఎంత దారుణమో ఆలోచించండి అన్నారు సీఎం జగన్.