Telugu Global
Andhra Pradesh

ప్రజాధనమంటే జగన్ కు లెక్కలేదా..?

నిజానికి ఈ సంక్షేమ పథకం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలవుతున్నదే కానీ, కొత్తదేమీ కాదు. అయితే ఆదివారం నాటి సంచిక‌లో మాత్రం ఇప్పుడే కొత్తగా అమల్లోకి వచ్చినట్లుగా పెద్ద ప్ర‌క‌ట‌న ఇచ్చింది ప్రభుత్వం.

ప్రజాధనమంటే జగన్ కు లెక్కలేదా..?
X

ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు అధికారంలో ఉన్నపార్టీ కేవలం ఐదేళ్ళు కస్టోడియన్ మాత్రమే. కానీ అధికార పార్టీలు మాత్రం ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్నే మార్చేశాయి. ప్రజాధనంతో సొంత ఇమేజిని పెంచుకోవటంలో పాలకులు బిజీ అయిపోయారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం గురించే. ఈరోజు కొన్ని దినపత్రికల్లో వైఎస్సార్ పెన్షన్ కానుక పేరుతో ఫ్రంట్ పేజ్ యాడ్స్‌ కనిపించాయి.

నిజానికి ఈ సంక్షేమ పథకం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలవుతున్నదే కానీ, కొత్తదేమీ కాదు. అయితే ఆదివారం నాటి సంచిక‌లో మాత్రం ఇప్పుడే కొత్తగా అమల్లోకి వచ్చినట్లుగా పెద్ద యాడ్ ఇచ్చింది ప్రభుత్వం. దీనివల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయినట్లే లెక్క. పథకం కొత్తదయితే, మొదటిసారి అమల్లోకి వస్తుంటే దానిగురించి జనాలందరికీ తెలిసేట్లుగా ప్రకటనలిచ్చారంటే అర్థ‌ముంది. కానీ, వైఎస్సార్ పెన్షన్ పథకం గడచిన మూడున్నరేళ్ళుగా అమలవుతున్నదే.

తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్లుగానే ప్రతి ఏడాది పెన్షన్ మొత్తాన్ని రు. 250 పెంచుకుంటూ వెళుతున్నారు జగన్. ఇంతమాత్రానికే ప్రతియేడాది పెద్దఎత్తున ప్రకటనలివ్వాల్సిన అవసరంలేదు. ఇదేకాదు చాలా పథకాల అమలును జనాలకు గుర్తుచేస్తూ జగన్ ప్రభుత్వం పెద్ద పెద్ద యాడ్స లిస్తూ లక్షల రూపాయలను వృథాచేస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇస్తున్నయాడ్స్‌ను చూస్తుంటే కేవలం తన సొంత పత్రిక సాక్షికి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడానికే అన్నట్లుగా ఉంది. గడచిన మూడున్నరేళ్ళలో కేవలం ప‌త్రికా యాడ్స్‌కే వందల కోట్లరూపాయలు ఖర్చుచేసుంటుంది.

ఒక్క సాక్షికి మాత్రమే ప్రకటనలిస్తే ఇబ్బంది అవుతుందని, దుష్టచతుష్టయంగా ప్రతిరోజు అభివర్ణించే ఈనాడుతో పాటు మరికొన్ని ప్రతికలకు కూడా ఇస్తున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు యాడ్స్‌ రిలీజ్ చేసినప్పుడు సాక్షిని పక్కనపెట్టేసి ఎల్లోమీడియాకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. మొత్తానికి అప్పుడూ ఇప్పుడూ వృథా అవుతున్నది ప్రజాధనమే అన్నది వాస్తవం. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజనాపై ఇలాంటి అనవసరమైన భారాలు అవసరమా అన్నదే అసలైన ప్రశ్న.

First Published:  1 Jan 2023 1:19 PM IST
Next Story