జగన్ బీసీ మంత్ర.. చంద్రబాబుకు ముచ్చెమటలు
లోక్‌సభ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టి చరిత్ర సృష్టిస్తున్నారు. బీసీలకు తానే ఛాంపియన్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి గుండెకాయలాంటి బీసీలను తన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వైసీపీకి అభిమానులుగా మార్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్, అధికారంలోనూ వారికి మంచి భాగస్వామ్యం కల్పించారు. ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి, క్షత్రియ వంటి అగ్రకులాలే ఆధిప్యతం చలాయించే లోక్‌సభ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టి చరిత్ర సృష్టిస్తున్నారు. బీసీలకు తానే ఛాంపియన్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ఆ ఆరింటిలో 4 నియోజకవర్గాల్లో బీసీలే
ఏలూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, విశాఖపట్నం.. ఈ ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు కమ్మవారి అడ్డాలే. పార్టీ ఏదైనా ఈ నియోజకవర్గాల్లో కొన్ని దశాబ్దాలుగా ఆ సామాజికవర్గం వారే ఎంపీలుగా గెలుస్తున్నారు. వీటిలో ఈసారి బీసీలను నిలిపి, గెలిపించి చరిత్ర తిరగరాయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. విజయవాడ, గుంటూరు తప్ప మిగిలిన 4 నియోజకవర్గాల్లో బీసీలనే నిలబెడుతున్నారు.
క్షత్రియుల స్థానంలోనూ బీసీ అభ్యర్థి
1957 నుంచి 2014 వరకు కమ్మవారే ఎంపీగా గెలిచిన ఏలూరులో ఈసారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.1999 నుంచి 2019 వరకు ఎంవీఎస్ (గీతం) మూర్తి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎంవీవీ సత్యనారాయణ వంటి కమ్మవారే నాలుగుసార్లు గెలిచిన విశాఖలో తూర్పు కాపుల నుంచి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మిని అభ్యర్థిగా నిలపబోతున్నారు. నరసరావుపేటలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపబోతున్నారు. తాజాగా ప్రకటించిన ఆరో జాబితాలో నరసాపురం నుంచి బీసీ వర్గానికి చెందిన గూడూరు ఉమాబాలకు, రాజమహేంద్రవరం నుంచి గూడూరి శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ బీసీలే. ఏ పార్టీ అయినా క్షత్రియ సామాజికవర్గం నుంచి కాదంటే కాపులకు టికెట్లిచ్చే నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన ఉమాబాలకు టికెట్ కేటాయించి సంచలనం సృష్టించారు.
చంద్రబాబుకు చెమటలు
బీసీబంధునని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు జగన్ బీసీలను నిలబెట్టిన స్థానాల్లో బీసీలను నిలబెడితే సొంత సామాజికవర్గంతోపాటు మిత్రపక్షం జనసేనలో కీలకంగా ఉన్న కాపుల నుంచి వ్యతిరేకత వస్తుంది. అలా అని అగ్రవర్ణాలకు టికెట్లిస్తే బీసీలు ఓట్లేయరు. దీంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు కిందా మీదా పడాల్సి వస్తోంది.