ప్రతిపక్షాలపైకి జగన్ మరో అస్త్రం
ఒకే ఇంట్లో మరొకరికి కూడా పెన్షన్ అందించాలంటే.. ఎంతమందికి అర్హత వస్తుందనే విషయాన్ని గ్రామ, వార్డు వలంటీర్లతో పాటు గృహసారథులు కూడా సర్వే చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి అధికార-ప్రతిపక్షాలు ఎవరికి వీలున్నంతలో అస్త్ర, శస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని రెడీ చేస్తున్నారట. పరిస్థితులన్నీ అనుకూలిస్తే వచ్చే జనవరి నెలలోనే ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ కొత్త అస్త్రం ఏమిటంటే.. డబుల్ పెన్షన్. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పెన్షన్లు చాలా కీలకమైనది. నెల 1,2 తేదీల్లోనే ఒకేసారి దాదాపు అరకోటి మందికి పైగా ఠంఛనుగా పెన్షన్ అందుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోయినా, లబ్దిదారులకు మాత్రం నెలమొదట్లోనే జగన్ పెన్షన్ అందిస్తున్నారు. ఈ రకమైన పెన్షన్లో వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ ఇంకా కీలకమైనది. ఇప్పుడు దాదాపు 45 లక్షలమంది వృద్ధులకు పెన్షన్ అందుతోంది. ఇప్పుడున్న పద్దతి ఏమిటంటే.. ఒకేఇంట్లో పెన్షన్ అర్హులైన వృద్ధులు ఇద్దరున్నా.. పెన్షన్ మాత్రం ఒకరికే అందుతోంది. ఈ నిబంధనను మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇకనుంచి ఇంట్లో అర్హులైన వృద్ధులు ఇద్దరుంటే.. ఇద్దరికీ పెన్షన్ అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ఒకే ఇంట్లో మరొకరికి కూడా పెన్షన్ అందించాలంటే.. ఎంతమందికి అర్హత వస్తుందనే విషయాన్ని గ్రామ, వార్డు వలంటీర్లతో పాటు గృహసారథులు కూడా సర్వే చేస్తున్నారు. అందుబాటులోని సమాచారం ప్రకారం అదనంగా సుమారు 15 లక్షల మందికి పెన్షన్ అందించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారట. ఈ లెక్కలు మొత్తం ఈనెలాఖరుకు అందుతాయని అనుకుంటున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ నెలకు 2,750 రూపాయలు ఇస్తున్నారు. వచ్చే జనవరికి రు. 250 అదనంగా కలిసి మూడు వేల రూపాయలవుతుంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, అనారోగ్యం తదితర కారణాలతో డబుల్ పెన్షన్ కు జగన్ రెడీ అవుతున్నారట.
పెరగబోయే పెన్షన్ రు. 3 వేలను అదనంగా యాడ్ అయ్యే అర్హులైన వృద్ధులకు కూడా అందించాలని జగన్ డిసైడ్ అయ్యారట. దీనివల్ల ప్రభుత్వంపై భారం విపరీతంగా పడటం ఖాయం. అయితే రాబోయే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే ప్రతిపక్షాలు ఇబ్బందుల్లో పడటం ఖాయమనే చెప్పాలి. అధికారంలోకి వస్తే తాము పెన్షన్ అంతిస్తాం.. ఇంతిస్తాం అని చంద్రబాబునాయుడు చెప్పుకోవాలి. కానీ, జగన్ ఆల్రెడీ ఇస్తున్నారు. అందులోనూ ఒకే ఇంట్లో రెండో పెన్షన్ అందించబోతున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు వైసీపీకే పడే అవకాశాలున్నాయి. మరి దీన్ని ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాల్సిందే.