Telugu Global
Andhra Pradesh

ఏపీలో కండవాల పండగ మొదలైంది

నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తాజాగా వైసీపీలో చేరారు. ఆయన చేరికతో జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతాయని చెప్పలేం కానీ.. టీడీపీని బలహీనపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలివన్నీ అనుకోవాల్సిందే.

ఏపీలో కండవాల పండగ మొదలైంది
X

ఏపీలో ఎన్నికలకింకా ఏడాది మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటి వరకూ జరిగిన చేరికలు ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్న, జరగబోయే చేరికలు మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, అందులో ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన సీఎం జగన్.. ఇక్కడ నష్టనివారణ చర్యలు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తాజాగా వైసీపీలో చేరారు. ఆయన చేరికతో జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతాయని చెప్పలేం కానీ.. టీడీపీని బలహీనపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలివన్నీ అనుకోవాల్సిందే.

సీట్ల సర్దుబాటు ఎలా..?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి తనయుడు రాఘవేంద్ర రెడ్డి. జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఎమ్మెల్యే టికెట్ పై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయనకు సెట్ కావడంలేదు. 2019లో వెంకటగిరి నుంచి వైసీపీ టికెట్ ఆశించారు కానీ, చివరి నిమిషంలో అది ఆనం రామనారాయణ రెడ్డికి దక్కింది. ఆ తర్వాత బొమ్మిరెడ్డి టీడీపీలో చేరారు. 2024లో ఆత్మకూరు నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కానీ, ఆనం అక్కడకు కూడా వస్తారనే ప్రచారం మొదలైంది. ఇక ఎక్కువ రోజులు టీడీపీలో ఉండి లాభం లేదనుకుని ఆయన పార్టీ మారారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. బొమ్మిరెడ్డికి టికెట్ హామీ ఇచ్చారని అనుకోలేం కానీ, వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లికి బొమ్మిరెడ్డి పోటీదారు అని చెప్పుకోవాలి. అదృష్టం కలసి వస్తే వెంకటగిరికి బొమ్మిరెడ్డి వైసీపీ అభ్యర్థి అయ్యే అవకాశాలున్నాయి.

నేదురుమల్లి సంగతేంటి..?

వెంకటగిరిలో ప్రస్తుతం వైసీపీకి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు బొమ్మిరెడ్డిని వెంకటగిరి తీసుకెళ్తే అక్కడ నేదురుమల్లికి సమస్యగా మారుతుంది. విశేషం ఏంటంటే.. ఈరోజు బొమ్మిరెడ్డి చేరిక సందర్భంగా ఆయన వెంట ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తోపాటు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం విశేషం. అంటే దాదాపుగా నేదురుమల్లి, బొమ్మిరెడ్డి మధ్య వెంకటగిరి సీటు విషయంలో చర్చలు జరిపే సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

First Published:  5 May 2023 6:28 PM IST
Next Story