దొమ్మేరులో దళిత యువకుడి మృతి.. అసలేం జరిగిందని జగన్ ఆరా
ఘటన జరిగిన రెండో రోజు పరామర్శకు వెళ్లిన మంత్రులు నాగార్జున, వనితలను వారు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందజేస్తామంటే నాగార్జునను పంపి వనితను రోడ్డుపైనే ఆపేశారు.
ఏపీ హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరులో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య ఘటన ఉభయ గోదావరి జిల్లాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా సీఎం జగన్ ఆరా తీశారు. హోం మంత్రి వనితతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునను కూడా సీఎం తాడేపల్లికి పిలిపించారు. అసలేం జరిగిందని ఇద్దరితో వేర్వేరుగా మాట్లాడారు. తమ పార్టీకే చెందిన దళిత యువకుడి బలవన్మరణం.. పరామర్శకు వెళ్లిన హోం మంత్రిని బాధితులు రెండు గంటలపాటు నడిరోడ్డుపైనే నిలబెట్టేయడం వంటి పరిణామాలతో సీఎం అప్రమత్తమయ్యారు.
అక్కడి వరకూ వచ్చేదాకా ఏం చేస్తున్నారు..?
వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలికి కుమారుడి వరుసయ్యే మహేందర్ అనే యువకుడ్ని పోలీసులు స్టేషన్‌కు పిలిచి, గట్టిగా మందలించారు. వైసీపీ ఫ్లెక్సీలోని నేతల ఫొటోలను కావాలనే చించేశారనే ఆరోపణలతో అతడ్ని ప్రశ్నించినట్లు, దానికి అతను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కథనం. స్టేషన్‌కు తీసుకెళ్లగానే హోం మంత్రికి చెప్పానని, వచ్చేస్తాడులే అని ఆమె లైట్ తీసుకున్నారని బాధితుడి బంధువైన వైసీపీ జెడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రెండో రోజు పరామర్శకు వెళ్లిన మంత్రులు నాగార్జున, వనితలను వారు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందజేస్తామంటే నాగార్జునను పంపి వనితను రోడ్డుపైనే ఆపేశారు. మీ సొంత నియోజకవర్గంలో పరిస్థితి అక్కడి వరకు వచ్చేదాకా ఏం చేస్తున్నారని వనితను జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది.
సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఎందుకొచ్చింది..?
2014 ఎన్నికల్లో టీడీపీ నేత కేఎస్ జవహర్ చేతిలో ఓటమిపాలైన వనిత గత ఎన్నికల్లో అదే కొవ్వూరు స్థానం నుంచి టీడీపీ మహిళా నేత అనితపై ఏకంగా 25 వేల మెజార్టీతో గెలిచారు. ఎస్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. అదీ హోం మంత్రి పదవి. అయితే వనిత కొవ్వూరులో కాకుండా భర్త శ్రీనివాస్ వైద్య వృత్తి నిర్వహిస్తున్న తాడేపల్లిగూడెంలో ఉంటారు. రాజధానిలో లేదంటే తాడేపల్లిగూడెంలో ఉంటారని, తమకు అందుబాటులో ఉండరని స్థానికులు వనితపై గుర్రుగా ఉన్నారు.హోం మంత్రిగా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిపెట్టలేదని కూడా విమర్శలున్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్ నుంచి సొంత పార్టీ మద్దతుదారును బయటికి తీసుకురాలేకపోయారని, ఆమెకు ఓట్లేసి గెలిపించినందుకు మంచి బహుమతి దక్కిందని అక్కడి ఎస్సీలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆమెను పిలిచి మాట్లాడారు. మరి నష్టనివారణ చర్యలు ఎలా ఉంటాయో!